
1. నర్సరీలో మొక్క ఎంపిక: నర్సరీకి వెళ్లినప్పుడు గుడ్డిగా ఏదో ఒక మొక్కను తీసుకోకూడదు. మొక్క కాండం దృఢంగా ఉండాలి, సన్నటి కొమ్మలు కాకుండా బలిష్టమైన కొమ్మలు ఉండాలి. ముఖ్యంగా గ్రాఫ్టింగ్ పోర్షన్ బలంగా ఉండి, కొమ్మలన్నింటికీ మొగ్గలు ఉండేలా చూసుకోవాలి. పువ్వులు పూయని అడవి కొమ్మలు ఉన్న మొక్కలను ఎంచుకోకూడదు.

2. తెచ్చిన వెంటనే రీపాటింగ్ చేయవద్దు: నర్సరీ వాతావరణానికి, మన ఇంటి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి తెచ్చిన వెంటనే కుండీ మార్చకుండా.. మన గార్డెన్‌లోని ఇతర మొక్కల మధ్యలో ఆ కవర్లలోనే 10 నుండి 15 రోజుల పాటు ఉంచాలి. నర్సరీ కవర్ల నుండి నీరు త్వరగా ఆవిరవుతుంది కాబట్టి ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా నీరు పోయాలి.

3. వదులైన తేలికపాటి మట్టి మిశ్రమం: గులాబీ వేర్లు సులభంగా విస్తరించడానికి మట్టి రాయిలా గట్టిగా ఉండకూడదు; చేత్తో పట్టుకుంటే వదులుగా రాలేలా ఉండాలి. సాధారణ తోట మట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్/పశువుల ఎరువు మరియు కోకోపీట్ లేదా వరిపొట్టును సమపాళ్లలో కలిపి తేలికపాటి పాటింగ్ మిక్స్ సిద్ధం చేయాలి.

4. కుండీ సైజు : ప్రారంభంలోనే పెద్ద పెద్ద కుండీల్లో నాటకూడదు; దీనివల్ల మొక్క ఒత్తిడికి గురవుతుంది. మొదటి ఏడాది 10 ఇంచుల లోపు ఉండే చిన్న కుండీల్లోనే నాటాలి. మొక్క బాగా ఎదిగి వేర్లు బలంగా విస్తరించిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే పెద్ద కుండీల్లోకి రీపాటింగ్ చేసుకోవాలి.

5. ఎండ & రీపాటింగ్ అనంతర సంరక్షణ : రీపాటింగ్ చేసిన వెంటనే నేరుగా తీవ్రమైన ఎండలో పెట్టకూడదు. మొదటి 15 రోజులు పూర్తిగా చెట్ల నీడలో, తర్వాతి 15 రోజులు ఉదయపు లేత ఎండ తగిలే సెమీ-షేడెడ్ ప్రాంతంలో ఉంచాలి. నెల రోజుల తర్వాత కొత్త చిగుళ్లు బలంగా వచ్చాక మాత్రమే రోజుకు 6-8 గంటల పూర్తి ఎండలోకి మార్చాలి. అలాగే తెచ్చిన పువ్వులను 2-3 ఇంచుల మేర కట్ చేసి, ఎండు తెగులు రాకుండా ఆ కత్తిరించిన భాగంపై కలబంద గుజ్జు, పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పూయాలి.

6. ఎరువులు ఇచ్చే సరైన సమయం: రీపాటింగ్ చేసిన మొదటి నెల రోజుల వరకు ఎలాంటి ఘన లేదా ద్రవ ఎరువులు ఇవ్వకూడదు; కేవలం సాధారణ నీళ్లు లేదా బియ్యం కడిగిన నీళ్లు మాత్రమే ఇవ్వాలి. నెల తర్వాత కొత్త ఆకులు వచ్చాక మొదట టీ పొడి, కాఫీ పొడి, వర్మీ కంపోస్ట్ వంటి తేలికపాటి నైట్రోజన్ ఎరువులను నిదానంగా ప్రారంభించాలి. ఎప్పటికప్పుడు ఎండిన పువ్వులను కత్తిరిస్తూ ఉంటే మొక్క కాండం లావెక్కడంతో పాటు నిరంతరం పూల వర్షం కురుస్తుంది