
పెరుగు - ఉల్లిపాయ: మనం బిర్యానీ లేదా పులావ్ తిన్నప్పుడు ఉల్లిపాయ రైతా తప్పనిసరిగా తింటాం. కానీ ఆయుర్వేదం ప్రకారం.. ఉల్లిపాయ స్వభావం వేడి, పెరుగు స్వభావం చల్లదనాని ఇచ్చేది. ఈ విరుద్ధ స్వభావం గల పదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంలో అసమతుల్యత ఏర్పడి.. చర్మ అలెర్జీలు, దురద, సోరియాసిస్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఆధునిక శాస్త్రం దీన్ని ఆమోదించకపోయినా, సున్నితమైన చర్మం ఉన్నవారు జాగ్రత్త వహించడం మేలు.

పెరుగు - దోసకాయ: చాలా ఇళ్లలో దోసకాయ రైతా ఫేమస్. అయితే దోసకాయ, పెరుగు రెండూ విపరీతమైన చల్లదనాన్ని ఇచ్చేవే. ఇవి శరీరంలో కఫంను పెంచుతాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగించి, జలుబు, దగ్గు లేదా సైనస్ సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది కలిగించవచ్చు.

పెరుగు - బెండకాయ: బెండకాయలో ఉండే జిగట గుణం, పెరుగుతో కలిసినప్పుడు జీర్ణం కావడం కష్టమవుతుంది. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, పేగుల్లో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

పెరుగు - కాకరకాయ: కాకరకాయ చేదుగా ఉంటుంది, పెరుగు పుల్లగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఇవి విరుద్ధ ఆహారాలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల వాత, పిత్త, కఫ దోషాల్లో తేడాలు వచ్చి తీవ్రమైన ఎసిడిటీ మరియు చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఆయుర్వేద నిపుణుల సలహాలు: పెరుగు వల్ల పూర్తి ప్రయోజనాలు పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మీరు రైతా తయారు చేస్తుంటే, అందులో వేయించిన జీలకర్ర పొడి, పుదీనా, నల్ల ఉప్పు తప్పకుండా కలపండి. ఇవి పెరుగు బరువైన ప్రభావాన్ని తగ్గించి సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా రాత్రి సమయంలో పెరుగు తినడం వల్ల శ్లేష్మం పెరుగుతుంది. మధ్యాహ్నం పూట తీసుకోవడమే ఉత్తమం. పెరుగును ఎప్పుడూ నేరుగా వేడి చేయకూడదు, అలా చేస్తే దానిలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది.