S Srinivasa Rao | Edited By: Srilakshmi C
Nov 26, 2023 | 6:55 AM
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో దొంగలు రెచ్చి పోయారు. వరుస చోరీలకు పాల్పడ్డారు. కిరాణా, కూరగాయలు, స్టేషనరీ , పాన్ షాపుల తాళాలు పగులగొట్టి దొంగతనంకి తెగబడ్డారు.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కాశీబుగ్గలోని మహాత్మాగాంధీ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సముదాయంలో 6 షాపులు, కోట్ని గురుమూర్తి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో 5 షాపుల్లోకి దొంగలు చొరబడ్డారు.
దుకాణాలలో ఉంచిన నగదును దోచుకున్నారు. ఇలా మొత్తం రూ.1 లక్ష 20 వేళ సొత్తు ఎత్తికెల్లినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. శనివారం ఉదయం దుకాణాలు తెరిచేందుకు వచ్చిన వ్యాపారులు తాళాలు పగుల గొట్టబడి, షట్టర్లు తెరిచి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు.
వెంటనే తేరుకున్న దుకాణదారులు తమ షాపులు చోరికి గురైనట్లు గుర్తించారు. పోలీసులకు పిర్యాదు చేశారు . కాశీబుగ్గ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాశీబుగ్గ సీఐ నవీన్ కుమార్ వెల్లడించారు.శుక్రవారం ఒక్కరోజే రాత్రికి రాత్రికి పదకొండు దుకాణాలలో చోరీలు జరగటం చర్చనీయాoశం అయ్యింది.