
మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకున్న బీజేపీకి ఒక్కసారిగా జలక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ దూసుకొచ్చింది. కర్ణాటక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. అందులోనూ పార్టీలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుండడం ఆ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తుందన్న వార్తలకు బలం చేకూర్చినట్లైంది. మరీ ముఖ్యంగా ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీతో పాటు మరికొందరు నేతలు పార్టీలో చేరడం, జులై 2వ తేదీన రాహుల్ గాంధీ అధ్యక్షతన ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడం కూడా పార్టీలో జోష్‌ని పెంచింది.
ఇదిలా ఉంటే ఈ జోష్‌ని మరింత పెంచే దిశగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇప్పుడు తెలంగాణపై దృష్టిసారించనున్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్న సంకల్పంతో ఆమె తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారు. ఇందులో భాగంగానే ప్రియాంక ఇప్పటికే తెలంగాణలో పర్యటించారు. సరూర్ నగర్‌లో జరిగిన యువ సంఘర్షణ సభలో పాల్గొన్న విషయం విధితమే. ఇక తాజాగా మరోసారి తెలంగాణకు విచ్చేయనున్నారు ప్రియాంక. ఈ నెల 20వ తేదీన ప్రియాంక తెలంగాణలో పర్యటించనున్నారు. కొల్లాపూర్‌లో జరగనున్న బహిరంగ సభలో ప్రియాంక పాల్గొంటారు. ఈ సభలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరు నేతుల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభలో టీపీసీసీ మహిళా డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని పార్టీ ఇప్పటికే ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ప్రియాంక తెలంగాణలో ఎలాంటి పాత్ర పోషిస్తుందన్న చర్చ మొదలైంది. ప్రియాంక టూర్‌తో రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు రావడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా సేవలందిస్తున్న సునీల్ కనుగోలు కూడా ఇదే సలహా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రచారానికి ప్రియాంక సారథ్యం వహించనుందని తెలుస్తోంది. నానమ్మ ఇందిరా గాంధీని పోలిన రూపం కూడా ప్రియాంకకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.
అంతేకాకుండా ఇంధిరాగాంధీకి తెలంగాణతో ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా ప్రియాంకకు అడ్వాటేంజ్‌గా మారుతుందని భావిస్తున్నారు. 1980 ఎన్నికల్లో ఇందిరా మెదక్ పార్లమెంట్‌కు పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇలా ఇంధిరాకు తెలంగాణ ప్రజలతో అనుబంధం ఏర్పడింది. దీంతో సహజంగానే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మెదక్‌తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలపై ప్రియాంక ప్రచార ప్రభావం కచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రియాంక ఏమేర ప్రభావం చూపుతుంది.? ప్రియాంకలో ఓటర్లు ఇందిరాను చూస్తారా.? తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..