Manipur Voilence: తగులబడుతున్న ఈశాన్య రాష్ట్రం… రెచ్చిపోతున్న ట్రైబల్స్.. మణిపూర్ మంటలకు కారణమిదే!

మణిపూర్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడానికి కారణం ఏంటి ? ఈ ప్రశ్నకు జవాబివ్వాలంటే పెద్ద నేపథ్యాన్నే వివరించాల్సి వుంటుంది.

Manipur Voilence: తగులబడుతున్న ఈశాన్య రాష్ట్రం... రెచ్చిపోతున్న ట్రైబల్స్.. మణిపూర్ మంటలకు కారణమిదే!
Manipur Violence

Updated on: May 07, 2023 | 5:50 PM

గత నాలుగైదు రోజులుగా ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్ మండుతోంది. ఇదేదో ప్రాస కోసం రాస్తున్నది కాదు. నిజంగానే మణిపూర్ తగులబడుతోంది. మూడు తెగల మధ్య చెలరేగిన ఘర్షణల కారణంగా మే 3వ తేదీ నుంచి మణిపూర్‌ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ముందుగా ఈ ఘర్షణలను ఆపి, శాంతి నెలకొల్పేందుకు ఈశాన్య రాష్ట్రాల శాంతి భద్రతలను పరిరక్షించే అసొం రైఫిల్ దళాలు యత్నించాయి. సుమారు 55 పటాలాల బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దాంతో కేంద్ర ప్రభుత్వం రాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ భారీ ఎత్తున మణిపూర్ రాష్ట్రానికి తరలించింది. ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. ఈ బలగాలకు చెందిన అధికారులు.. ఘర్షణలకు పాల్పడుతున్న వర్గాల నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ విధించారు. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కానీ, ఆందోళనకారులు తమ పంథాను మార్చి మరీ రాష్ట్రాన్ని తగుల బెడుతున్నారు. ఆస్తుల విధ్వంసం, ఆస్తులకు, వాహనాలకు నిప్పు పెట్టడం వంటివి పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఇంతకీ మణిపూర్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరగడానికి కారణం ఏంటి ? ఈ ప్రశ్నకు జవాబివ్వాలంటే పెద్ద నేపథ్యాన్నే వివరించాల్సి వుంటుంది.

ఈ తెగలే అక్కడ కీలకం

మణిపూర్ రాష్ట్రంలో ఉంటున్న కుకీ, నాగా, మెతీ తెగల ప్రజల మధ్య ఇపుడు తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. దాంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘర్షణల తీవ్రత పెరగడంతో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేశారు. కానీ ఘర్షణలు ఆగలేదు సరికదా ఇంకా పెరుగుతూనే వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో మెతీ తెగ వారిని గిరిజనుల్లో కలిపే చర్యలు వేగవంతమవడమే. రాష్ట్ర జనాభాలో సుమారు 55 శాతం వున్న మెతీ తెగ వారు చాలా కాలంగా తమని గిరిజనుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని కోర్టు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలకుపక్రమించింది. ఇదే అక్కడ ఆల్ రెడీ గిరిజనుల జాబితాలో వున్న కుకీ, నాగా తెగ వారికి ఆగ్రహం తెప్పించింది. మణిపూర్‌లో ముఖ్యంగా మూడు తెగల ప్రజలు ఉన్నారు. కుకీ తెగ, నాగా తెగ, మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు. 4వ తెగ అయిన కుకీ ఫంగల్ కూడా అక్కడ ఉంది. కుకీ,నాగా తెగల ప్రజలు షెడ్యూల్ ట్రైబ్ కింద రక్షణ పొందుతున్నారు. వీరంతా అందరూ క్రిస్టియన్లు. మెజారిటీ వర్గంగా వున్న మెతీ ప్రజలు హిందువులు. వీరు మణిపూర్‌లో 2 వేల సంవత్సరాలకి పై బడి ఉంటున్నారు. ఇక మెతీ తెగ ప్రజలలో మతం మార్చబడిన వారిని మెతీ పంగల్‌ అంటారు వీళ్ళు ముస్లింలుగా మారిన హిందువులు. మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం 22 వేల చదరపు కిలోమీటర్ల విస్తరించి వుంది. ఇందులో 10 శాతం లోయ ప్రాంతం. ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది. మిగతా 90 శాతం కొండ ప్రాంతంగా వుంటుంది. ఈ ప్రాంతంలోనే కుకీ, నాగా జాతి ప్రజలు వుంటారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు.

హిల్ ఏరియా కమిటీ అత్యంత కీలకం

ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ళలోనే కుకీ, నాగా ప్రజలను షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు. ఈ కుకీ, నాగా ప్రజలు మొత్తం కొండల మీద ఉంటారు. ఈ కొండ ప్రాంతాలకు రక్షణగా ఆర్టికల్ 371సీని రాజ్యాంగంలో చేర్చారు. మొన్నటి వరకు కశ్మీర్ కోసం వున్న ఆర్టికల్ 370 లాంటిదే ఈ 370సీ ఆర్టికల్. దీని ప్రకారం మణిపూర్ రాష్ట్రంలోని కొండ, పర్వత ప్రాంతాల్లో గిరిజనులు తప్ప వేరే వారు భూములను కొనలేరు. ఈ కొండ ప్రాంతాలలో బయటి వాళ్ళు ఎవరూ స్థలాలు కొనడానికి వీలు లేదు. ఈ కొండ ప్రాంతంలో ఉండే అడవులలో కుకీలు,నాగాలు ఉండవచ్చు కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు. బయటి వాళ్ళు కొనడానికి లేదు. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరయినా స్వేచ్ఛగా స్థలాలు కొనవచ్చు, అక్కడ ఎవరయినా నివాసాలు ఏర్పరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చన్నమాట. ఇదే ఇపుడు మణిపూర్ రాష్ట్రంలో చిచ్చు రాజేసింది. ఒకే రాష్ట్రంలో మైదాన ప్రాంతానికి ఒక చట్టం, కొండ, పర్వత ప్రాంతాని ఒక చట్టం వుండడమే రాష్ట్రంలో ఘర్షణలకు దారి తీసిందని చెప్పాలి. మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల కోసమని ప్రత్యేకంగా హిల్ ఏరియా కమిటీ (HAC) ఏర్పాటు చేశారు. ఈ హిల్ ఏరియా కమిటీ అనేది ఏదో ఆషా మాషీ కమిటీ కాదు. దీని అధికారాలు వింటే విస్తుపోవాల్సిందే. మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ శాసన సభ్యుల ఆమోదం పొందితే సరిపోదు. ఈ హెచ్.ఏ.సీ.కి బడ్జెట్‌లో పొందుపరిచిన అంశాలను కూలంకషంగా వివరించాలి. బడ్జెట్ అంశాలు గిరిజనులైన కుకీ, నాగా ప్రజలకు వ్యతిరేకంగా లేదని ఈ కమిటీ విశ్వసిస్తేనే రాష్ట్ర బడ్జెట్ అమలుకు నోచుకుంటుంది. వారేమైనా అభ్యంతరాలు తెలిపితే మాత్రం బడ్జెట్‌ను సవరించాల్సిందే. హిల్ ఏరియా కమిటీ ఆమోదం లేకపోతే రాష్ట్ర బడ్జెట్‌కు విలువ ఉండదు. దాంతోపాటు.. మణిపూర్ లాండ్ రెవెన్యూ అండ్ లాండ్ రిఫార్మ్‌ల మీద కూడా ఈ హిల్ ఏరియా కమిటీకి అధికారం ఉంది.

ఆర్టికల్ 370సీ వల్లే ఇదంతా

షెడ్యూలు కులాలు, షెడ్యూల్ జాతుల కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడయితే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్‌లో ఉన్న కుకీ, నాగా ప్రజలకి ఎస్టీ హోదా దక్కింది. అలాగే కొండ ప్రాంతాలలో ఉండే అడవులలో స్వేచ్చగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కును కూడా కల్పించారు. అయి‌తే కుకీలు, నాగాలు మతం మారి క్రైస్తవం స్వీకరించిన తర్వాత వారి ఎస్టీ హోదాను రద్దు చేయకపోవడమే ఇపుడు ఈ పరిస్థితికి దారి తీసింది. అదే కొండ దిగువ ప్రాంతంలో ఉండే మెతీ ప్రజలను జనరల్ కేటగిరిలో వుంచారు. వాళ్ళు అనాదిగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. అసలు మణిపూర్‌లో మూల వాసులుగా చెప్పబడే మెతీ ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు దక్కలేదు. లోయలోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మెతీ ప్రజల స్థలాలను ఎవరయినా కొనవచ్చు. బయటి వాళ్ళు అక్కడ ఉద్యోగ,వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు వుంది. బయటి నుంచి వచ్చిన వారు లోయలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇదే ఇపుడు సమస్యకు కారణమైంది. బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి మణిపూర్‌కు చాలా ఏళ్ళపాటు వలసలు కొనసాగాయి. ఈ మధ్య ఈ ఇన్‌ఫిల్ట్రేషన్ తగ్గినా గత నాలుగు దశాబ్దాలుగా చాలా పెద్ద సంఖ్యలో మయన్మార్ రోహింగ్యాలు, బంగ్లాదేశ్ హిందువులు మణిపూర్ లోయకు వచ్చి స్థిరపడ్డారు. దాంతో మెతీ తెగ వారికి అవకాశాలు అడుగంటడం మొదలైంది. మెతీ ప్రజల అవకాశాలను బంగ్లాదేశ్, మయన్మార్ఱ నుంచి వచ్చిన వారు హరిస్తున్నారు. దాంతో తమని గిరిజనుల్లో కలిపి కొండ ప్రాంతంలో ఆస్తులు కొనే అవకాశం కల్పించాలని మెతీ ప్రజలు చిరకాలంగా కోరుతూ వస్తున్నారు. వారి డిమాండ్‌ను పట్టించుకోకపోవడం, వారి ఆందోళనలు అణిచివేయడంతో మెతీ ప్రజలు విసిగిపోయి, రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు మెతీ ప్రజల వాదనలను విన్న తర్వాత వారిని ఎస్టీ కేటగిరీలో చేర్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసి పంపాలని మణిపూర్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలే కుకీ, నాగా తెగ ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. దాంతో మెతీ తెగ వారిపై దాడులకు, దౌర్జన్యానికి దిగారు నాగా, కుకీ జాతి ప్రజలు. కుకీ ప్రజలు తాము సహజంగా వాడే కత్తులతోను, నాగా ప్రజలు ఏకంగా ఏకే 47 రైఫిళ్ళతోను దౌర్జన్యాలకు పాల్పడ్డారు.

గంజాయి దందాతో ఐఎస్ఐ గేమ్స్

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి కూడా వుంది. ఇపుడు దాడులకు పాల్పడుతున్న కుకీ, నాగాలకు కొండ ప్రాంతాల్లో గంజాయి పండించడం, దాన్ని అమ్ముకుని బతకడం అలవాటు. గంజాయిని పండించడం తమ ట్రెడిషనల్ పంటగా వారు భావిస్తారు. ఆర్టికల్ 370సీని అడ్డుపెట్టుకుని వారు ఆగడాలకు పాల్పడుతున్నారు. అటవీ ప్రాంతాలను తమ సొంత ఆస్తులుగా వారు భావిస్తున్నారు. నిజానికి ఆర్టికల్ 370 సీ ప్రకారం నాగా, కుకీ జాతుల వారికి అడవుల్లో నివసించే హక్కు మాత్రమే వుంది. కానీ అక్కడి స్థలాలను అమ్ముకోవడం వంటి చేయకూడదు. కానీ వీరు అలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ వుంటారు. ఇటీవల మణిపూర్ అటవీ,రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేసి గంజాయి పంటలను తగులబెట్టారు. స్థానిక నేతల్లో కొందరు తమ స్వార్థం కోసం నాగాలు, కుకీలలో అడవుల్లో వారు ఏమైనా చేసుకునే హక్కుందంటూ నూరి పోస్తూ వచ్చారు. అదే ఇపుడు కొంప ముంచింది. మరో వైపు ఆర్టికల్ 371సీ ఇస్తున్న రక్షణని ఆసరాగా చేసుకొని కుకీలు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. నిజానికి కుకీ తెగ ప్రజలు మణిపూర్‌తో పాటు పక్కనే ఉన్న మయన్మార్ దేశంలో కూడా ఉన్నారు. అక్కడి సైనిక నియంత ప్రభుత్వం కుకీలని అక్రమంగా భారత్‌లోకి పంపించడానికి సహకరిస్తూ వస్తోంది. మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో నివసించే కుకీలు గంజాయిని పండించడం, దానిని ప్రాసెస్ చేసి హెరాయిన్‌గా మార్చి పక్కనే ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్‌లోని తీసుకెళ్ళి అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకు విక్రయిస్తున్నారు. పాకిస్థాన్ ఐఎస్ఐకి డబ్బు సమకూరే మార్గాలలో మణిపూర్‌లోని కుకీలు ఉంటున్న అడవులు ఒక మార్గం. కుకీలకు తక్కువ డబ్బు ఇచ్చి హెరాయిన్ కొని, దానిని అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువకు అమ్ముతుంటారు ఐఎస్ఐ ఏజెంట్లు. అలా వచ్చిన సొమ్మును డాలర్ల రూపంలోకి మార్చుకుంటుంది ఐఎస్ఐ. పాకిస్థాన్ ఐఎస్ఐ, మయన్మార్‌లోని సైనిక నియంత ప్రభుత్వ అధికారులు, చైనాతో కలిసి మణిపూర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేశారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ దేశాల నుంచి వస్తున్న అండతో కుకీ, నాగాలు రెచ్చిపోతున్నారు. మెతీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని హైకోర్టు గుర్తించడంతో వారికి త్వరలో న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తుండగా ఇపుడు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారు. మణిపూర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఇపుడు భారతీయ భద్రతా దళాలకు సవాలుగా మారింది.