INSPIRING: డెలివరీ బాయ్ నుంచి కోటీశ్వరుడి వరకు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న కుర్రాడి సక్సెస్ స్టోరీ!

జీవితం ఒక్కసారిగా తలకిందులైతే చాలామంది నీరుగారిపోతారు. నిరాశ చెందుతారు. జీవితం అయిపోయిందని డిప్రెస్ అవుతారు. డిప్రెషన్‌లోకి వెళ్లి ఏం చేయాలో అర్ధం కాని అయోమయానికి గురవుతారు. అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఇక మన వల్ల కాదని చేతులెత్తేస్తారు. కానీ ఆ యువకుడు అలా అనుకోలేదు.

INSPIRING: డెలివరీ బాయ్ నుంచి కోటీశ్వరుడి వరకు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Delivery Boy To Crorepati

Updated on: Dec 28, 2025 | 11:15 AM

ఓటమి నేర్పిన పాఠంతో పట్టుదలను ఆయుధంగా మార్చుకున్నాడు. కేవలం ఐదేళ్ల కాలంలో తన తలరాతను తానే మార్చుకుని వేలమందికి స్ఫూర్తిగా నిలిచాడు. అప్పుల బాధ నుంచి బయటపడి ఏకంగా కోటీశ్వరుడిగా అవతరించిన ఆ యువకుడి సక్సెస్ స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వ్యాపారంలో ఎదురుదెబ్బ

దక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన పాతికేళ్ల ఆ కుర్రాడు 2020లో ఎంతో ఆశతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. అయితే అదృష్టం కలిసిరాక కొన్ని నెలల వ్యవధిలోనే ఆ బిజినెస్ మూతపడింది. వ్యాపారం పోవడమే కాకుండా సుమారు ఆరున్నర లక్షల రూపాయల అప్పు మిగిలింది. ఆ వయసులో అంత భారం పడితే ఎవరైనా కుంగిపోతారు. కానీ ఆ కుర్రాడు నిరాశ చెందకుండా కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా అప్పు తీర్చి మళ్ళీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

టార్గెట్‌వైపు అడుగులు

అప్పులు తీర్చడం కోసం షాంఘైలోని ఒక ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో చేరాడు. అక్కడ అందరిలా కాకుండా ఒక పక్కా ప్లాన్‌తో పని చేయడం మొదలుపెట్టాడు. నెలకు కనీసం మూడు లక్షల రూపాయలు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాడు. దీనికోసం నిద్రను, విశ్రాంతిని పక్కనపెట్టాడు. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు అంటే సుమారు 14 గంటల పాటు రోడ్లపైనే గడిపేవాడు. రోజుకు కనీసం 300 పార్శిళ్లను కస్టమర్లకు అందించేలా ప్రణాళిక వేసుకున్నాడు.

రికార్డు స్థాయిలో డెలివరీలు

ఏడాదిలో 365 రోజులు పని చేస్తూ తన అంకితభావాన్ని చాటుకున్నాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ వంటి పెద్ద పండుగలకు కూడా సెలవు తీసుకోకుండా డెలివరీలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఒక్కో పార్శిల్‌ను 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తూ కంపెనీలో రికార్డు సృష్టించాడు. ఐదేళ్ల కాలంలో సుమారు 3 లక్షల 24 వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. లక్షన్నరకు పైగా పార్శిళ్లను కస్టమర్లకు చేర్చి తోటి ఉద్యోగులతో ‘ఆర్డర్ కింగ్’ అని పిలిపించుకున్నాడు.

కొత్త జీవితం.. కొత్త ఆశలు

ఐదేళ్ల కఠోర శ్రమ తర్వాత ఆ యువకుడు ఒక కోటి 80 లక్షల రూపాయలు మొత్తాన్ని సంపాదించుకున్నాడు. అందులో ఖర్చులు పోను ఒక కోటి 42 లక్షల రూపాయలు పొదుపు చేశాడు. అప్పులన్నీ తీర్చేశాడు. కొత్త ఏడాదిలో తన కలల వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టబోతున్నాడు. కోటి రూపాయల పెట్టుబడితో రెండు టిఫిన్ సెంటర్లు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. కష్టపడే తత్వం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన ఈ యువకుడిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది.