పరీక్షలు రాసేటప్పుడు విద్యార్ధులు మాస్ కాపీయింగ్‌కి పాల్పడతారేమోనని సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతిక్షణం వారిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే పరీక్షల్లో స్టూడెంట్స్ కాపీ కొట్టకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించారు ఓ ప్రొఫెసర్. ఫిలిప్పీన్స్‌లోని బికోల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన మేరి జోయ్ మాండేన్ ఆర్టిజ్ అనే ప్రొఫెసర్ విద్యార్ధులకు ఓ కండిషన్ పెట్టారు. ‘నో చీటింగ్’ పేరుతో పరీక్ష రాసే సమయంలో విద్యార్ధులు తలలు తిప్పకుండా ఉండేందుకు టోపీ, లేదా వస్త్రం ధరించాలని విద్యార్థులను ఆదేశించారు.
ప్రొఫెసర్ ఆదేశాలను తప్పకుండా పాటించారు ఆ విద్యార్ధులు. ప్రొఫెసర్ కండిషన్‌కి తగ్గట్టుగానే స్టూడెంట్స్ కూడా క్రేజీగా అలోచించారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి రకాల రకాల టోపీలు, హ్యాట్‌లను తయారు చేసుకుని తలపై ధరించి వచ్చారు. పేపర్లు, కార్డ్ బోర్డ్, ఎగ్ బాక్సెస్, రీసైకిల్డ్ మెటీరియల్ ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో హెల్మెట్‌లా వాటిని ధరించి పరీక్షలు రాశారు.
ఎవరివైపు చూడకుండా, కాపీయింగ్‌కు పాల్పడుకుండా నిజాయితీగా ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్టూడెంట్స్ అందరూ సమగ్రతతో నిజాయితీగా ఉండాలనే ఈ ఆలోచన చేసినట్లు ప్రొఫెసర్ ఆర్టిజ్ చెప్పారు. 2013లో థాయ్‌లాండ్‌లోని ఓ యూనివర్శిటీలో ఇలా చేయడం చూశానని, ఇదేదో బావుందనిపించి తాను కూడా ఈ వినూత్న ప్రయోగం చేసానని చెప్పారు.