
మహారాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు పెద్ద శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, ఈ-బస్సులను టోల్ టాక్స్ ఫ్రీగా చేశారు. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. మహారాష్ట్ర ప్రభుత్వ టోల్ టాక్స్ మినహాయింపు పథకం ప్రయోజనం అటల్ సేతు, పూణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌లలో సైతం అందుబాటులో ఉంటుంది. ఈ నియమం శుక్రవారం(ఆగస్టు 22) నుండి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వర్ ఈ సమాచారం ఇచ్చారు.
పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసకుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే రెండు రకాల ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు వర్తిస్తుంది, అది ప్రైవేట్ వాహనాలు, ప్రభుత్వ వాహనాలకు వర్తి్స్తుంది. మహారాష్ట్ర ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ కింద ప్రభుత్వం ఏప్రిల్‌లో దీనిని ప్రకటించింది.
టోల్ నుండి మినహాయింపు పొందిన వాహనాలలో ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లు, ప్యాసింజర్ ఫోర్-వీలర్లు, మహారాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ బస్సులు, పట్టణ ప్రజా రవాణా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అయితే, వస్తువులను తీసుకెళ్లే ఎలక్ట్రిక్ భారీ వాహనాలను మినహాయించారు. ముంబైలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ 25,277 ఈ-బైక్‌లు, దాదాపు 13,000 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ముంబైలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఇప్పుడు 43,000 కంటే ఎక్కువగా ఉంది. ఈ సంఖ్యలో అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి.
అలాగే ప్రతిరోజూ దాదాపు 60,000 వాహనాలు అటల్ సేతు గుండా ప్రయాణిస్తాయి. రాబోయే కాలంలో, ఈ మార్గాన్ని పూణే ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం, MSRTC, NMMT వంటి కొన్ని ప్రజా రవాణా బస్సులు కూడా అటల్ సేతులో తిరుగుతున్నాయి. మహారాష్ట్రలోని అన్ని రహదారులపై EV కార్లు, బస్సులకు టోల్ ఫ్రీని చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ అన్నారు.
కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇది పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం లక్ష్యం. ఎక్స్‌ప్రెస్‌వేలు, సమృద్ధి మహామార్గ్, ఇతర హైవేలలో అనేక ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తామని ఒక అధికారి తెలిపారు. ముంబైలోని పెట్రోల్ పంపులతో, హైవేలలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అన్ని ఇంధన పంపులు, ఎస్టీ స్టాండ్‌లు, డిపోలలో నాలుగు నుండి ఐదు ఛార్జింగ్ పాయింట్లు ఉండేలా చూసుకోవాలి. ఇది ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవర్లకు ఛార్జింగ్ గురించిన ఆందోళన పడాల్సిన పనిలేదని మహారాష్ట్ర రవాణా శాఖ స్పష్టం చేసింది.
భవిష్యత్తులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 30% ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలని కొత్త విధానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 40%గా నిర్ణయించారు. కార్లు, SUVలకు 30%, ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్ క్యాబ్‌లకు 50%, ప్రైవేట్ బస్సులకు 15%గా లక్ష్యంగా నిర్ణయించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..