ఆ మాజీ కేంద్రమంత్రి జోక్ చేసిందే .. బీహార్ ఎన్నికల్లో నిజమయ్యింది..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. అధికార ఎన్డీఏ విజయం సాధించగా, యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌ను విమర్శిస్తూ ఆయన చేసిన 200 సీట్ల అంచనా నిజమవడంతో, ఎన్నికల ఫలితాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఆ మాజీ కేంద్రమంత్రి జోక్ చేసిందే .. బీహార్ ఎన్నికల్లో నిజమయ్యింది..!
Yashwant Sinha Bihar Election Prediction

Updated on: Nov 15, 2025 | 7:14 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. అధికార ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసి.. 202 స్థానాలు గెలుచుకోగా, ప్రతిపక్ష మహా కూటమి కేవలం 35 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఫలితాల నేపథ్యంలో దేశానికి రెండుసార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు యశ్వంత్ సిన్హా చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్‌ను విమర్శిస్తూ ఆయన ఎన్నికలకు ముందు చేసిన వ్యంగ్యాత్మక అంచనా ఇప్పుడు అక్షరాలా నిజమైంది.

సిన్హా వ్యంగ్యం 200 సీట్లు నిజం

ఎన్నికల ఫలితాలకు ముందు, యశ్వంత్ సిన్హా ఎగ్జిట్ పోల్స్‌ను ఎద్దేవా చేస్తూ ఒక పోస్ట్ చేశారు. ఆయన అంచనా వ్యంగ్యంగా ఉన్నప్పటికీ, ఫలితాలు దాదాపుగా అదే తరహాలో రావడంతో అది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ‘‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు. నా సర్వే ప్రకారం ఎన్డీఏ కనీసం 200 సీట్లు గెలుచుకుంటుంది. మహా కూటమి తుడిచిపెట్టుకుపోతుంది. నవంబర్ 14న నా అంచనా పూర్తిగా తప్పు అని నిరూపిస్తే, నేను బాధ్యత వహించను’’ అని అన్నారు.

ఫలితాల తర్వాత ..

ఎన్డీఏ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో యశ్వంత్ సిన్హా మరో రెండు పోస్ట్‌లు చేసి, ఎన్నికల ఫలితాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ పోస్ట్‌లో ఆయన ఎన్నికల ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్య చేశారు. “జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంత కాలం.. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం మానేయాలి’’ అని విమర్శించారు.

రెండు సార్లు ఆర్థిక మంత్రిగా

యశ్వంత్ సిన్హా తన రెండుసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మొదట 1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో ఆపై 1998 నుండి 2002 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పనిచేశారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో 2002 జూలై నుండి 2004 మే వరకు ఆయన విదేశాంగ మంత్రిగా సేవలందించారు. అయితే సిన్హా 2018 ఏప్రిల్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అప్పటినుంచి మోదీ ప్రభుత్వం, బీజేపీకి తీవ్ర విమర్శకుడిగా మారారు. ఆయన 2022లో ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..