కేంద్రం వార్నింగ్‌తో దిగొచ్చిన మస్క్.. 72 గంటల్లోనే వేల పోస్టులు, వందల అకౌంట్లు బ్లాక్..

ఎలోన్ మస్క్‌కు చెందిన ఎక్స్ ఏఐ అసిస్టెంట్ గ్రోక్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ప్రభుత్వ హెచ్చరికలతో దిగివచ్చిన ఎక్స్ యాజమాన్యం.. కేవలం 72 గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో పోస్టులను తొలగించి, వందలాది ఖాతాలను శాశ్వతంగా రద్దు చేసింది. అసలు ఏం జరిగిందంటే..?

కేంద్రం వార్నింగ్‌తో దిగొచ్చిన మస్క్.. 72 గంటల్లోనే వేల పోస్టులు, వందల అకౌంట్లు బ్లాక్..
X Deleted 600 Accounts

Updated on: Jan 11, 2026 | 10:52 AM

సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్స్‌కు చెందిన గ్రోక్ సాయంతో కొందరు అసభ్యకర, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను సృష్టిస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం, వాటిపై తక్షణ చర్యలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ భారీగా ప్రక్షాళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే 3,500 అసభ్యకర పోస్టులను బ్లాక్ చేసింది. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను శాశ్వతంగా తొలగించింది.

వివాదం ఏమిటి..?

ఎక్స్ లోని ఏఐ ప్లాట్‌ఫామ్ గ్రోక్‌ను ఉపయోగించి కొందరు మహిళల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నట్లు ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఐటీ నిబంధనలను గుర్తు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో గ్రోక్ లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై ఎక్స్ పరిమితులు విధించింది. ఇకపై ఈ ఫీచర్‌ను కేవలం ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.

72 గంటల్లోనే యాక్షన్

అశ్లీల కంటెంట్‌ను నిరోధించే విషయంలో ఎక్స్‌కు కేంద్రం కేవలం 72 గంటల గడువు ఇస్తూ గత వారం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద లభించే సేఫ్ హార్బర్‌ను కోల్పోతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ దిగివచ్చి భారీ చర్యలు చేపట్టింది.

ప్రభుత్వానికి హామీ

భారత ప్రభుత్వ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తామని ఎక్స్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అసభ్యకర కంటెంట్ విషయంలో తమ వేదిక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వచ్చే చట్టవిరుద్ధమైన కంటెంట్‌కు ఆయా సంస్థలే బాధ్యత వహించాలని, తక్షణమే వాటిని తొలగించకపోతే కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us