
వెండితో ఎన్నో రకాలుగా ఆభరణాలను తయారు చేసినా పిలిగ్రీ కళను మాత్రం కరీంనగర్ బిడ్డలు మాత్రమే అందిపుచ్చుకున్నారు. పిలిగ్రీ ద్వారా తమలోని కళను ప్రదర్శిస్తున్న కరీంనగర్ వాసుల చరిత ప్రంపంచానికి సుపరిచితమే. ఇప్పుడు జీ20 సమావేశాల్లోనూ కరీంనగర్ పిలిగ్రీ తళుకుమనిపించనుంది. కరీంనగర్ కళాకారులు తమ నైపుణ్యానికి పదునుపెట్టి తయారుచేసిన వస్తువులు జీ20 దేశాల ప్రతినిధులు అలంకరించుకోనున్నారు. కరీంనగర్ కళాకారులు తయారు చేసిన బ్యాడ్జిలు జీ-20 దేశాల ప్రతినిధుల కోటుకు అలంకారం కానున్నాయి. కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారులు వెండితో తయారు చేసిన 200 అశోక చక్రం బ్యాడ్జిలను పంపించారు. తెలంగాణ హైండ్ క్పాప్ట్స్ విభాగం ద్వారా తొలిసారి కరీంనగర్ పిలిగ్రీకి అరుదైన గౌరవం దక్కినట్టయింది. ఈ నెల 9, 10 తేదిలలో జరగనున్న జీ20 సమ్మిట్‌కు హజరయ్యే 20 దేశాల ప్రతినిధులకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ బ్యాడ్జెస్ తొడగనున్నారు.
అత్యంత అరుదైన కళల్లో ఒకటైన సిల్వర్ పిలిగ్రీ కళ దేశంలోనే చాలా తక్కువమంది నేర్చుకున్నారు. తెలంగాణాలోని కరీంనగర్ కు చెందిన వారితో పాటు ఒడిశాలోని కటక్ ప్రాంతానికి చెందిన వారు కూడా ఈ కళను అందిపుచ్చుకున్నారు. అయితే కరీంనగర్ కళాకారులు వారసత్వంగా వచ్చిన సిల్వర్ పిలిగ్రీ కళను నేటికీ పోషిస్తూ తమలోని కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. జీఐ కూడా పొందిన కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కాళాకారులు గతంలో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. కానీ ఈ సారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న జీ20 సమ్మిట్ ప్రతినిధులకు అలంకారంగా మారబోతోంది. అంతేకాకుండా న్యూ ఢిల్లీలో జరగనున్న సమ్మిట్ సందర్భంగా దేశంలోనే అరుదైన కళాత్మకతను ప్రదర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేసింది.
ఇందులో కూడా కరీంనగర్‌కు చెందిన అశోక్ స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఈ స్టాల్ లో కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ కళాకారుల చేతిలో తయారు చేసిన అద్భుత కళాఖండాలు ప్రదర్శించనున్నారు. దీనివల్ల జీ20 దేశాల్లో భారత్ లో ఉన్న అత్యంత అరుదైన కళకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కళల కాణాచిగా పేరుపడిన కరీంనగర్ వాసులు మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు తమలోని కళాత్మకతను ప్రదర్శించే అవకాశం రావడం అద్భుతమని అంటున్నారు స్థానికులు. ఇదిలా ఉండగా సెప్టెబర్ 9, 10వ తేదీల్లో రెంజు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలోని జీ20 సమావేశం జరగనుంది. ఇప్పటికే భారత్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.
ఇక దేశాధినేతలు ఇండియాకు తరలిరానున్నారు. ముందుగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మధ్యాహ్నం 1.40 PM గంటలకు ఢిల్లీలో దిగనున్నారు. అలాగే చైనా, రష్యా, స్పెయిన్ దేశాధినేతలు పలు కారణాల వల్ల ఈ సదస్సుకు రావడం లేదు.