మూడు దశాబ్ధాలుగా ఊరిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు త్వరలోనే మోక్షం లభించనుంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు విపక్షాల నుంచి కూడా మద్ధతు లభిస్తుండటంతో ఇది పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయంగా తెలుస్తోంది. తాజాగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బహుజన్ సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) కూడా మద్ధతు ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ పార్టీ మద్ధతు ఉంటుందని బీఎస్పీ చీఫ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్పష్టంచేశారు. పార్లమెంటుతో పాటు ఇతర చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లులకు బీఎస్పీ మద్ధతుగా నిలుస్తుందని స్పష్టంచేశారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు ఈ సారి మోక్షం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన 33 శాతం కాకుండా.. 50 శాతం సీట్లను లోక్‌సభ, రాష్ట్ర చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. అప్పుడే జనాభాలో సగమున్న మహిళలకు చట్టసభలోనూ సరైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు.
అలాగే మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలు, ఎస్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా కోటా కల్పించాలని మాయావతి కోరారు. ఇప్పుడు ఈ కోటా లేకపోయినా తమ పార్టీ మద్ధతు బిల్లుకు ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. బీఎస్పీతో పాటు మరిన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. చర్చ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
#WATCH | UP: "Along with BSP, most of the parties will give their vote in the favour of Women's Reservation Bill… We expect that after the discussion this bill will get passed this time as it was pending for a long. I said earlier on behalf of my party in the Parliament that… pic.twitter.com/UheOjTwXJx
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 19, 2023
లోక్‌సభతో పాటు రాష్ట్రాల చట్ట సభల్లో మహిళలకు మూడింట ఒక వంతు(33 శాతం) రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో కేంద్రం మంగళవారంనాడు ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దీనిపై బుధవారం నుంచి చర్చ జరగనుంది. సుదీర్ఘ చర్చ అనంతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లును సెప్టెంబరు 21న ప్రవేశపెట్టనున్నారు. పలు విపక్షాలు కూడా మద్ధతు ఇస్తుండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం ఖాయంగా తెలుస్తోంది. ఇది చట్టరూపం దాల్చితే లోక్‌సభ, రాష్ట్రాల చట్టసభల్లో 15 ఏళ్ల పాటు మహిళలకు ఈ రిజర్వేషన్లు అమలులో ఉంటుంది.
కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికిప్పుడు అమలు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం లేదు. 2027లో డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్నాయి.