
మహారాష్ట్రలోని కరాడ్ తాలూకా ఆనేకు చెందిన కాళిదాస్ దేశాయ్ అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం సోనాలి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త కాళిదాస్ కరాడ్-ధేబెవాడి రాష్ట్ర రహదారిపై పంక్చర్ దుఖానాన్ని నడిపిస్తూ ఇంటిని నడిపేవాడు. అయితే ఏడాది క్రితం పంక్చర్ చేస్తుండగా ఒక్కసారిగా టైర్ పేలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాళిదాస్ చకిత్స పొందుతూ మరణించాడు. ఇక షాప్‌ను నడిపేవారు ఎవరూ లేకపోవడంతో అతని పంక్చర్ షాప్ ఆరు నెలల పాటు మూత బడింది. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయాయి.
కొన్ని సందర్భంగాల్లో ఇంట్లో తినడానికి బియ్యం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక జీవనోపాధికి వేరే మార్గం లేకపోవడంతో, అతని భార్య సోనాలి దేశాయ్ తన భర్త దుకాణాన్ని తానే నడపాలని నిర్ణయించుకుంది. ఆమె భర్త బ్రతికి ఉన్నప్పుడు పంక్చర్ ఎలా వేయాలో అని కొన్ని విషయాలు ఆమె కూడా నేర్చుకుంది. దీంతో ఆమె భర్త పంక్ఛర్ దుకాణాన్ని తెరిచి నడపడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల్లోనే, పెద్ద కార్ల, లారీలు, ట్రాక్టర్లకు సైతం ఆమె పంక్చర్లు వేయడం నేర్చుకుంది. ఒక మగమనిషికి దీటుగా ఆమె అన్ని పనులు చేయడం ప్రారంభించింది. ఇప్పుడు స్థానికంగా ఉన్న దుకాణాలకు పోటీగా ఆమె తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
అయితే తాను 10వ తరగతి వరకు చదువుకున్నాని, తన భర్త చనిపోవడంతో ఆయన స్నేహితులు, అన్నదమ్ములు, అత్తమామలు ఈ పనిలో తనకు సహాయం చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, అలాగే అత్తగారు సహా నలుగురు ఉన్నారని.. కేవలం ఈ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంతోనే తన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఆమె తెలిపింది. సామాజిక సంస్థలు, స్వయం సహాయక సంఘాలు లేదా ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సహాయం అందితే తన వ్యాపారాన్ని విస్తరించాలనేదే తన ఉద్దేశమని ఆమె చెప్పుకొచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.