
టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక సదస్సు ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ (WITT) 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా TV9 సీఈఓ, ఎండీ బరుణ్ దాస్ ప్రధాని నరేంద్ర మోదీకి సాదర స్వాగతం పలుకుతూ, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ‘3-F’ (Fuel, Food, Finance)లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని బరుణ్ దాస్ పేర్కొన్నారు. ప్రపంచం ఒక కురుక్షేత్రంలా మారిన ఈ తరుణంలో, భారత్ వైపు యావత్ ప్రపంచం ఆశగా చూస్తోందని ఆయన అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని ప్రధాని మోదీ ప్రపంచానికి గుర్తు చేస్తున్నారని ఆయన కొనియాడారు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ‘సంబుద్ధి'(నిష్పక్షపాత బుద్ధి) అనే సూత్రాన్ని నేడు ప్రధాని మోదీ ప్రపంచ వేదికపై అమలు చేస్తున్నారని బరుణ్ దాస్ అభివర్ణించారు. అందరినీ సమానంగా చూడటం, నిష్పక్షపాతంగా వ్యవహరించడమే ఈ మంత్రం సారాంశమని, దీనివల్లనే భారత్ గ్లోబల్ ఆర్డర్‌లో కీలక శక్తిగా ఎదిగిందని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ కేవలం బాహ్య సవాళ్లను మాత్రమే కాకుండా, అంతర్గత సవాళ్లైన పేదరికం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వంటి రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తోందని ఆయన చెప్పారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రధాని మోదీ దూరదృష్టి, సాహసోపేతమైన నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని బరుణ్ దాస్ ప్రశంసించారు. చివరగా, భారత్ నేడు ఏం ఆలోచిస్తుందో అది ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తోందని, ఈ మార్పు మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.