
మీకో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. అభినవ్ అరోరా ఎవరు? తెలియకపోతే ఈ పోటీ ప్రపంచంలో చాలా చాలా వెనకబడి ఉన్నట్టేనండి..! ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆయన చెప్పే ప్రవచనాలు, అతన్ని చూడ్డానికి వచ్చే భక్తులు, సోషల్ మీడియాలో ఫాలోవర్లు, సోషల్ మీడియాలో ఆయన ఇంటర్వ్యూల కోసం ఎగబడడాలు.. అబ్బో ఎంత పేరు ప్రతిష్టలో. కొంపదీసి ఆ పేరు వినలేదా ఏమిటి మీరు..! ‘అదేంటీ.. అంత పెద్ద స్వామీజీని మేమెలా మిస్ అయ్యాం.. అభినవ్ అరోరా పేరు వినకపోవడం, ఇప్పటికీ ఆయన్ను దర్శించుకోలేకపోయాం అంటే.. అంత పుణ్యం మేము చేసుకోలేదా’ అనుకుంటుంటున్నారేమో. మరేం ఫర్వాలేదు. ఆయన ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఓ ‘బాబా’. వయసు జస్ట్ పదేళ్లు. ఈ.. ‘వయసు పదేళ్లు’ అనగానే మీలో చాలామంది ‘జ్ఞాననేత్రం’ తెరుచుకునే ఉంటుంది. పైగా అభినవ్ అరోరా అంటే చాలామందికి తెలీకపోవచ్చు. ‘బాబా అభివన్ అరోరా’ అంటేనే తెలుస్తుంది. నార్త్ ఇండియాలో ఫుల్ ఫేమస్ పర్సనాలిటీలెండి..! బాబా అభినవ్ అరోరా వయసు పదేళ్లే కావొచ్చు. కాని, తెలివితేటలను కాస్త ఎక్కువ ఇచ్చాడు దేవుడు. పైగా చురుకైనవాడు కూడా. మాటల మరాఠి. ఎవరైనా ప్రశ్నించడం ఆలస్యం.. చివర క్వశ్చన్‌మార్క్ పెట్టకముందే సమాధానాలు మొదలు పెట్టేస్తుంటాడు. మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ప్రవచనాలు చెబుతున్నాడంటే అతని టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవాలిక్కడ. ప్రవచనారంగంలో ఇప్పటికే ఏడేళ్ల అనుభవం సంపాదించినట్టు లెక్క. అతనో దైవాంశ సంభూతుడు అన్నట్టుగా ప్రవచనాలు చెబుతాడని ఫాలోవర్స్ చెప్పుకుంటుంటారు....