ఇక్కడ యంగ్ టైగర్.. అక్కడ ఇళయ దళపతి.. రీల్‌ హీరోలే రియల్‌ హీరోలవుతారా?

|

Jul 18, 2023 | 8:15 PM

ఇక్కడ తారక్.. అక్కడ విజయ్... రాజకీయాల్లోకి వస్తారో రారో తెలీదు. ఫ్యాన్స్ మాత్రం వాళ్ల మీద వత్తిడి పెంచుతూనే ఉన్నారు. రీల్‌ హీరోల్నే రియల్‌హీరోలుగా భావిస్తున్న జనం.. ఓటుమీటర్ల దగ్గర మాత్రం తేడాగా స్పందిస్తున్నారు. కొందరు గుణపాఠాలు నేర్చుకుని వెనక్కెళ్లిపోతే.. మరికొందరు హీరోలు మాత్రం దండయాత్రలు చేస్తూనే ఉన్నారు. తమతమ అదృష్టాల్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. మరి.. తారక్, విజయ్‌ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయ్… అసలు వాళ్ల జర్నీ స్ట్రెయిట్ పాలిటిక్స్‌ దాకా వస్తుందా?

ఇక్కడ యంగ్ టైగర్.. అక్కడ ఇళయ దళపతి.. రీల్‌ హీరోలే రియల్‌ హీరోలవుతారా?
Jr Ntr - Vijay
Follow us on

ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీలు… నెక్స్ట్‌ సీఎం ఎన్టీయారే అంటూ వాటి మీద రాతలు… నందమూరి ఇలాఖాలో వారసత్వ కలకలం.. నిజానికి ఇది కొత్తేమీ కాదు. జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ అరంగేట్రం అనేది ఎప్పటికప్పుడు తెలుగు రాజకీయాల్ని హీటెక్కించే ఎలిమెంటే. గతంలో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినా.. ప్రజాజీవితానికి బాగా చేరువయ్యారు తారక్. తర్వాత సినిమాలే నాకు ఫస్ట్ ప్రయారిటీ అంటూ సైడిచ్చుకున్నారు.

హావభావాలు, ఫేస్ కటింగ్స్, డైలాగ్ డెలివరీ విషయంలో తాతను పోలినట్టుంటే ఎన్టీయార్.. నందమూరి వంశాంకురంగా పేరు తెచ్చుకున్నారు. తారక్ చరిష్మాను, పాపులారిటీని లెక్కలేసుకుని రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ వత్తిడి తెస్తూనే ఉన్నారు అభిమానులు. దాదాపు ఇదే ఏజ్ గ్రూప్‌తో ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ది కూడా దాదాపుగా ఇదే సిట్యువేషన్. ఇళయ దళపతిగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్… దాదాపు దశాబ్దకాలంగా పొలిటికల్ వార్తల్లో కనిపిస్తున్నారు. విజయ్ పేరు మీద ఆయన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌… పార్టీని ప్రకటించారు. అదంతా గతం. కానీ.. ఇటీవలే తన పొలిటికల్ ఆంబిషన్స్‌ని బైటపెట్టుకున్నారు విజయ్.

ఫ్రెష్ ఓటర్లే టార్గెట్‌గా స్కెచ్చులేసుకుంటున్నారు విజయ్. డబ్బు తీసుకుని ఓటేసే ట్రెండ్‌ని మానెయ్యండి.. మన ట్రెండ్ మనం క్రియేట్ చేద్దాం అంటూ ఇటీవల ప్లస్‌టూ స్టూడెంట్స్‌ని ఉద్దేశించి స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మెరికల్లాంటి విద్యార్థుల్ని చేరదీసి.. వాళ్లకు రాజకీయ పాఠాలు నేర్పించాలన్నది విజయ్ ఆలోచన. ఈ మేరకు తన అభిమాన సంఘాల సమాఖ్య… విజయ్ మక్కళ్ ఇయక్కమ్‌ని అలర్ట్ చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లోనూ సాయంత్రం బడులు ప్రారంభించాలని పిలుపునిచిచారు. విజయ్ ప్రతిపాదిస్తున్న ఈవెనింగ్ ట్యూషన్స్ మీదే టోటల్ తమిళనాట చర్చ జరుగుతోందిప్పుడు. ఇప్పటినుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ తమిళనాడులో 2026లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాటుదేలాలన్న స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు ఇళయ దళపతి.

ఎంత సీరియస్‌గా వర్కవుట్ చేసినా… తమకున్న కోట్లాదిమంది అభిమానుల మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి హీరోలది. ఇక్కడ మెగాస్టార్, అక్కడ సూపర్‌స్టార్.. ఇద్దరూ రాజకీయాలకో దండం పెట్టి బ్యాక్‌స్టెప్ తీసుకున్నవాళ్లే. 2009లో చిరంజీవి సొంత పార్టీ పెట్టి 18 శాతం ఓట్లు మాత్రమే సాధించి.. అధికార పగ్గాలు చేపట్టలేకపోయారు. తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. కేంద్రమంత్రిగా పనిచేసి.. పైనల్‌గా రాజకీయ సన్యాసం ప్రకటించారు. రారమ్మని మళ్లీమళ్లీ పిలుపులొస్తున్నా.. నోవే అంటున్నారు. సినిమానే తన ప్రపంచం అంటూ తేల్చేశారు.

కోలీవుడ్‌ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా పొలిటికల్ డ్రీమ్స్‌ని పూర్తిగా పక్కకుపెట్టేశారు. జయలలిత, కరుణానిధి హయాం నడుస్తున్నప్పుడే రజనీ రాజకీయ ప్రవేశం గురించి జోరుగా వార్తలొచ్చేవి. పార్టీ పెట్టబోతున్నా అని ప్రకటించారు కూడా. మోదీ, అమిత్‌షా తరచూ రజనీని కలుస్తూ.. ఆయన అభిమానుల్లో ఆశలు ఊరేలా చేశారు. కానీ.. అనారోగ్యం బాధపెడుతోంది రాజకీయాలు చేసే ఓపిక లేదు అంటూ షాకిచ్చేశారు. ఆవిధంగా క్లవర్ స్టార్స్ అనిపించుకున్నారు మెగాస్టార్ అండ్ సూపర్‌స్టార్.

తమకున్న పాపులారిటీని ఉపయోగించుకుని సొంత భావజాలంతో పబ్లిక్‌ లైఫ్‌కి దగ్గరయ్యే ప్రయత్నం మరికొందరిది. ఇదే మైండ్‌సెట్‌తో ఇప్పటికీ కుస్తీలు పడుతూనే ఉన్న హీరోలు పవన్‌కల్యాణ్ అండ్ కమల్‌హాసన్. ఓటమిని ఒప్పుకోకుండా పడిలేస్తూనే పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం అంటూ మళ్లీమళ్లీ పరీక్షకు నిలబడుతున్నారు. వీళ్లిస్తున్న స్పూర్తితోనే కోలీవుడ్‌లో విజయ్, టాలీవుడ్‌లో తారక్ ముందడుగు వేస్తారా.. లేక టాప్‌ హీరోలుగా తమకున్న సినిమా లైఫ్‌ని మరికొన్నేళ్లు కంటిన్యూ చేస్తారా..? అప్పటిదాకా ఇలా ప్లెక్సీల మీదే కాలక్షేపం చేస్తారా?.. చూడాలి మరి.

మరిన్ని జాతీయ వార్తల కోసం