
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద బోస్ మధ్య వివాదం మరో లెవెల్‌కి చేరుకుంది. తన అధికారిక నివాసం రాజ్ భవన్‌లో గూఢచర్యం చేశారని ఆరోపించారు గవర్నర్ ఆనంద బోస్. కోల్‌కతాలోని గవర్నర్ హౌస్‌లో గూఢచర్యం గురించి తనకు విశ్వసనీయ సమాచారం ఉందని బోస్ పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బోస్ తెలిపారు. గూఢచర్య ప్రయత్నాలను ఎవరు నిర్వహిస్తున్నారో గవర్నర్ వెల్లడించలేదు. అయితే గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్ బోస్ సంబంధాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. అంతేకాదు పలు విషయాల్లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద బోస్ మధ్య గొడవలు జరగడం గమనార్హం.
యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ల నియామకం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం విషయంలో కేంద్రం MNREGA బకాయిలను నిలిపివేయడం, అలాగే రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ హింసకు సంబంధించిన సమస్యలపై బోస్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలు తలెత్తాయి.
నవంబర్ 16న, TMC కార్యకర్త హత్యపై స్పందిస్తూ, బెంగాల్ రాజకీయాల్లో హింసాత్మక సంస్కృతి ఉందని బోస్ అభిప్రాయపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గవర్నర్ బోస్. రాజ్ భవన్ కూడా తన విధిని నిర్వహిస్తుంది అని ఆయన అన్నారు. హింసపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు బోస్. బెంగాల్ రాజకీయాలను హింసాత్మకంగా ప్రభావితం చేస్తున్నందున, న్యాయపరమైన చర్యలతో పాటు సామాజిక చర్యలను కూడా మనం పాటించాలి. హింస సంస్కృతికి స్వస్తి పలకాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
నవంబర్ నెల ప్రారంభంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో కొత్త ఫలకాల ఏర్పాటుపై విశ్వవిద్యాలయం నుండి నివేదికను కోరారు గవర్నర్ బోస్. దీంతోపాటు రాజ్‌భవన్ ఉత్తర ద్వారం పేరును ‘గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గేట్’గా మార్చారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ భవన్‌కు మరింత దూరం పెంచాయి.
అంతకుముందు, పశ్చిమ బెంగాల్ స్పీకర్ బిమన్ బెనర్జీ కూడా బిల్లులను ఆమోదించడంలో ఆలస్యానికి గవర్నర్ కారణమని ఆరోపించారు. 2011 నుంచి ఇప్పటి వరకు 22 బిల్లులకు రాజ్‌భవన్ నుంచి ఆమోదం లభించలేదని బెనర్జీ తెలిపారు. వీటిలో ఆరు బిల్లులు ప్రస్తుతం సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…