రాజ్ భవన్‌లో సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్..! రాజకీయ రచ్చ..

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ (CV Ananda Bose) తన సొంత విగ్రహాన్ని రాజ్ భవన్‌లో ఆవిష్కరించారు. గవర్నర్ పదవిలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాజ్ భవన్‌లో సొంత విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్..! రాజకీయ రచ్చ..
West Bengal Governor CV Ananda Bose

Updated on: Nov 24, 2024 | 7:43 PM

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన సొంత విగ్రహాన్ని రాజ్ భవన్‌లో ఆవిష్కరించారు. గవర్నర్ పదవిలో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే గవర్నర్ తన సొంత విగ్రహాన్ని రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసుకోవడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది. గవర్నర్ పదవిలో కొనసాగుతూనే.. సొంత విగ్రహాన్ని రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసుకోవడం విడ్డూరమంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గవర్నర్ తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న ఇలాంటి విడ్డూరాన్ని ముందెన్నడూ చూడలేని తృణాముల్ కాంగ్రెస్ మండిపడింది. సొంత పబ్లిసిటీ మోజుతోనే గవర్నర్ ఇలా చేశారని టీఎంసీ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముజుందర్ పేర్కొన్నారు. ముందు ముందు ఇంకా ఎన్ని జరుగుతాయోనంటూ ఎద్దేవా చేశారు. తన సొంత విగ్రహానికి గవర్నర్ పూలదండ వేస్తారా? అంటూ ప్రశ్నించారు.

రాజ్ భవన్‌లో ఆనంద బోస్ విగ్రహ ఆవిష్కరణ

గవర్నర్ తన సొంత విగ్రహాన్ని రాజ్ భవన్‌లో ఏర్పాటు చేసుకోవడం అవమానకరమైన చర్య అంటూ సీపీఎం మండిపడింది. ఇది రాష్ట్రానికి పట్టిన పీడ అంటూ సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యులు సుజన్ చక్రవర్తి మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు.. బెంగాల్ సంస్కృతితో చిల్లర ఆటలు ఆడుతున్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సౌమ్య రాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజ్ భవన్ వివరణ..

కాగా దీనిపై రాజ్ భవన్ కార్యాలయం దీనిపై వివరణ ఇచ్చింది. గవర్నర్ ఆనంద బోస్ తన విగ్రహాన్ని ఆవిష్కరించుకోలేదని.. ఇది ఇండియన్ మ్యూజియంకు చెందిన కళాకారుడు పార్థ సాహ బహుమతిగా ఇస్తే.. దాన్ని గవర్నర్ తెరతీసి చూసుకున్నారని తెలిపింది.

సుదీర్ఘకాలంగా ప్రజా సేవలో ఉన్న గవర్నర్ ఆనంద బోస్ గౌరవార్థం ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు ఇండియన్ మ్యూజియం తెలిపింది.

ఇండియన్ మ్యూజియం ప్రకటన..

పశ్చిమ బెంగాల్‌లో రోజుకో కొత్త రాజకీయ వివాదం పుట్టుకొస్తోంది. ఇప్పుడు గవర్నర్ ఆనంద్ బోస్ చుట్టూ రాజకీయ దుమారం రాజుకుంది. విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు మాట్లాడిన గవర్నర్.. బెంగాల్‌లో రాజకీయ వాతావరణం దారుణంగా ఉందని అసంతృప్తి వ్యక్తంచేశారు. గవర్నర్ పదవిలో తన రెండేళ్ల పదవీ కాలం తీపి చేదుల కలయికగా పేర్కొన్నారు.

ఇంతకీ సీవీ ఆనంద బోస్ ఎవరంటే..?

సీవీ ఆనంద బోస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 23 నుంచి అంటే.. గత రెండేళ్లుగా ఆయన పశ్చి బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు. సీవీ ఆనంద్ బోస్ రచయిత కూడా.. ఆయన ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో 32 పుస్తకాలు రచించారు. గవర్నర్ కాకముందు బీజేపీలో పనిచేశారు.