
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా ఇంధన కొరత కలగకుండా.. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత కోసం భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతున్నప్పటికీ.. భారత్ ముందస్తు సన్నద్ధతతో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్యుడిపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశీయ అవసరాల కోసం డీజిల్‌పై రూ. 21.5, విమాన ఇంధనంపై రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని విధించింది. అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల వదంతుల వల్ల పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, భయాందోళనతో కొనుగోళ్లు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఎల్పీజీ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం పీఎన్జీ నెట్‌వర్క్‌ను యుద్ధ ప్రాతిపదికన విస్తరిస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లకు 5 రోజుల్లోగా పిఎన్‌జి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం ఈ నెలలోనే 2.9 లక్షల కొత్త కనెక్షన్లు అందించారు. పైప్‌లైన్ల ఏర్పాటు కోసం భూసేకరణ, అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ వేగవంతమైన ఆమోద ఫ్రేమ్‌వర్క్‌ను అమలులోకి తెచ్చారు.
సముద్ర మార్గాల్లో భారతీయ నౌకల ప్రయాణం సురక్షితంగా సాగేలా రక్షణ మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ డైరెక్టరేట్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న రెండు భారీ నౌకలు ప్రమాదకర ప్రాంతాన్ని దాటి భారత తీరానికి చేరుకుంటున్నాయి. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తూ ఇప్పటివరకు 942 మంది నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించింది.
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు సుమారు 5,24,000 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చారు. గగనతలం మూసివేసిన దేశాల నుండి ప్రక్క దేశాల మీదుగా ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.