Vizag Stleel Plant – Oxygen: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. లక్షల్లో కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. చాలామంది కోవిడ్ బాధితులు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు లేక గత కొన్ని రోజుల నుంచి పదుల సంఖ్యలో కోవిడ్ బాధితులు మరణించారు. ఈ తరుణంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశానికే ఊపిరిపోస్తోంది. కేంద్రం వదిలించుకోవాలన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం అత్యధికంగా సహజ వాయువును ఉత్పత్తి చేస్తూ దేశవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి రోజూ 100 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అత్యవసర అవసరాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని.. కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆక్సిజన్ కోసం ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుకర్మాగారాలపైనే ఆధారపడుతున్నాయి. ఏపీలో మూడో వంతు ఆస్పత్రులకు విశాఖ నుంచే ఆక్సిజన్ సరఫరా అవుతుండగా.. అదనంగా మహారాష్ట్రకు 150 టన్నుల ఆక్సిజన్‌ను విశాఖ స్టీల్ ప్లాంట్ సరఫరా చేస్తోంది. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉక్కు కర్మాగారం మరికొన్ని రాష్ట్రాలకు ప్రాణవాయువును సరఫరా చేయనుంది. ఇప్పటికే 400 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సరఫరా చేసింది. గత ఆర్థిక సంవత్సరం 8,842 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది.
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఐదు ఆక్సిజన్ తయారీ యూనిట్‌లు ఉన్నాయి. ఈ యూనిట్లల్లో 24 గంటలూ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 2,950 టన్నులు. ఇందులో 2,700 టన్నులు వాయురూప, 250 టన్నులు ద్రవరూప ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తారు. రోజుకు గరిష్ఠంగా 2,800 టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 100-150 టన్నుల వరకు ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ఆక్సిజన్ ప్లాంట్ అవసరాలకే సరిపోతుంది. అయితే వీటిలో రోజుకి 50-60 టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ను కొవిడ్ ఆస్పత్రులు, ఇతర అవసరాల కోసం సరఫరా చేస్తుంది. అయితే తాజా కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో రోజుకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసే సామర్థ్యం ఉందని విశాఖ ఉక్కు వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే దేశంలో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఉండటంతో.. విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా మరికొన్ని చోట్ల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లల్లో మొత్తం 28 మేజర్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రోజూ 1500 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఈ ఆక్సిజన్‌ను కోవిడ్ రోగులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్టీల్ ప్లాంట్‌లు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: