జ్యోతికి ఆ కంపెనీ స్పాన్సర్‌షిప్‌.. పాకిస్తాన్‌కు వెళ్లే ముందు అతనితో భేటీ..! వెలుగులోకి సంచలన విషయాలు

జ్యోతి మల్హోత్రా విదేశీ ప్రయాణాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త విషయం బయటికొచ్చింది. జ్యోతికి యూఏఈకి చెందిన ట్రావెల్‌ కంపెనీ వీగో స్పాన్సర్‌షిప్‌ చేసినట్లు బయటపడింది. పాకిస్తాన్‌లో కార్యకలాపాలకు వీగో కంపెనీకి ట్రావెల్‌ ఏజెన్సీ లైసెన్స్‌ ఉంది.

జ్యోతికి ఆ కంపెనీ స్పాన్సర్‌షిప్‌.. పాకిస్తాన్‌కు వెళ్లే ముందు అతనితో భేటీ..! వెలుగులోకి సంచలన విషయాలు
Jyoti Malhotra

Updated on: May 24, 2025 | 3:05 PM

పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో పరిచయాలున్నట్లు ఎన్‌ఐఏ విచారణలో అంగీకరించింది హర్యానా యూట్యూబర్‌. ఐదు రోజులు జ్యోతిని విచారించిన అధికారులు కీలక విషయాలు రాబట్టారు. వాదనల తర్వాత కోర్టు ఆమెకు మరో 4 రోజుల రిమాండ్‌ విధించింది. జ్యోతి మల్హోత్రా విదేశీ ప్రయాణాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త విషయం బయటికొచ్చింది. జ్యోతికి యూఏఈకి చెందిన ట్రావెల్‌ కంపెనీ వీగో స్పాన్సర్‌షిప్‌ చేసినట్లు బయటపడింది. పాకిస్తాన్‌లో కార్యకలాపాలకు వీగో కంపెనీకి ట్రావెల్‌ ఏజెన్సీ లైసెన్స్‌ ఉంది. దీనికి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ అక్రిడిటేషన్‌ కూడా ఉంది. సింగపూర్‌, దుబాయ్‌లలో ఈ కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో అరబ్‌ ఎమిరేట్స్‌ ట్రావెల్‌ కంపెనీపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఈ ఏడాది జనవరి – మే మధ్య పాకిస్తాన్‌తో సహా నాలుగు దేశాలను సందర్శించింది. ముఖ్యంగా, డానిష్ అనే వ్యక్తిని కలిసిన 17 రోజుల తర్వాత ఆమె పాకిస్తాన్‌కు ప్రయాణించినట్లు విచారణలో వెల్లడైంది.

జ్యోతి మల్హోత్రా మరో యూట్యూబర్‌ ప్రియాంకతో కలిసి ఒడిశాలోని పూరీ ఆలయంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత కోణార్క్‌ ఆలయాన్ని కూడా సందర్శించినట్లు పూరీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఎంక్వైరీలో బయటపడింది. అయితే ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు దొరకలేదంటున్నారు పోలీసులు.

భారత్‌లోని పాక్‌ హైకమిషన్‌లో పనిచేసే డానిష్‌తో జ్యోతి మల్హోత్రా సంబంధాలు, వారి నెట్‌వర్క్‌పై ఆరాతీస్తున్నారు. జ్యోతి మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆమె బ్యాంకు ఖాతాల లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..