Viral Video: అకాల వర్షాల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు, కొట్టుకుపోతున్న రోడ్లు.. వైరల్‌గా మారిన వీడియో

|

Apr 30, 2023 | 12:33 PM

హిమాచల్‌ ప్రదేశ్‌ భాబా వ్యాలీలో కొండచరియలు విరిగిపడడంతో ఓ రోడ్డు లోయలోకి జారిపోయింది. రహదారి మధ్యలోకి కూలిపోవడంతో కాఫ్ను, యాంగ్పా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండపై ఉన్న ఈ రహదారిపై తొలుత పగుళ్లు ఏర్పడ్డాయి.

Viral Video: అకాల వర్షాల బీభత్సం.. విరిగిపడుతున్న కొండచరియలు, కొట్టుకుపోతున్న రోడ్లు.. వైరల్‌గా మారిన వీడియో
Rains In Himachal Pradesh
Follow us on

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కళ్లాల్లో ధాన్యం కళ్లెదుటే కొట్టుకుపోతుంటే కన్నీళ్లతో చూస్తున్నారు రైతులు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో అకాల వర్షానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారులు కొట్టుకుపోతున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌ భాబా వ్యాలీలో కొండచరియలు విరిగిపడడంతో ఓ రోడ్డు లోయలోకి జారిపోయింది. రహదారి మధ్యలోకి కూలిపోవడంతో కాఫ్ను, యాంగ్పా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండపై ఉన్న ఈ రహదారిపై తొలుత పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ పగుళ్లు కాస్తా నెమ్మదిగా పెద్దగా మారడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. ఏప్రిల్‌ 29న మధ్యాహ్నం రోడ్డు దాదాపు మొత్తంగా కూలిపోయింది. రోడ్డు కింది భాగంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు కూడా తెగిపోయింది. ఆ సమయంలో రహదారిపై వాహనాలు ఏవీ ప్రయాణించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైందని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా తాంగ్లింగ్ తెహసిల్ కల్పలో కొండ చరియలు విరిగిపడడంతో యాపిల్ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తోటలపై బండరాళ్లు పరుచుకున్నాయని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కొండప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..