ట్రాఫిక్ ఆంక్షలు అందరికీ వర్తిస్తాయి. వీటి నుంచి ఎవరికీ.. ఎటువంటి సడలింపు ఉండదు అనే నిరూపించే సంఘటన ఒకటి బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సగం హెల్మెట్ ధరించిన పోలీసధికారికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. బెంగళూరులో ఈ విధమైన హెల్మెట్‌తో డ్రైవింగ్ చేయడం నిషేధం. ముఖ్యంగా గేర్‌లెస్ స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు హాఫ్ హెల్మెట్ ధరించకూడదు. ఐతే పోలీసు అధికారి అయ్యుండి.. ఈ విధంగా నిబంధనలకు వ్యతిరేకంగా హెల్మెంట్ ధరించినందుకు ట్రాఫిక్ సిబ్బంది హెల్త్ హెల్మెట్ కేసు బుక్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో సోమవారం పోస్టు చేశారు.
ఇక ఈ పోస్టును చూసిన నెటజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎవరినైనా పోలీసులు వదలరని కొందరు ప్రశంసించగా, మరికొందరేమో ఇదంతా పెద్ద డ్రామాలా ఉంది. ‘నిజమేనైతే.. కెమెరాకి ఎందుకు నవ్వుతూ పోజులిస్తున్నట్లు? జరిమానా విధిస్తే ఎవరైనా నవ్వుతారా’ అని ఒకరు, ‘అతను ఎంత సంతోషంగా కనిపిస్తున్నాడో.. ఫోటో దిగేందుకు మంచి అవకాశం దొరికినట్లుందని’ మరొకరు, ‘సర్.. అతనికి జరిమానా సరిపోదు. చాలా మంది పోలీసులు హెల్మెట్ లేకుండా వెళ్ళనివ్వడం నేను చాలా సార్లు చూశాను’ అని ఇంకొకరు, ‘పబ్లిసిటీ స్టంట్’ అని పలువురు కామెంట్ సెక్షన్లో తమ అభిప్రాయాలను తెలిపారు.
Good evening sir
half helmet case booked against police
Tq pic.twitter.com/Xsx5UA40OY— R T NAGAR TRAFFIC BTP (@rtnagartraffic) October 17, 2022
ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం అనేది ట్రాఫిక్ నిబంధన. ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ప్రయాణికులకు సూచనలు ఇవ్వడానికి పోలీసులు ఇంత డ్రామా ఆడినట్లు అధికమంది నెటిజన్లు పేర్కొన్నారు. కాగా గత నెలలో కూడా ఇలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై ట్రాఫిక్ పోలీస్ హెల్మెట్ పెట్టి, ట్రాఫిక్ నిబంధనలను వివరిస్తు్న్నట్లు వీడియోలో కన్పిస్తుంది. ప్చ్.. పాపం..! ట్రాఫిక్ పోలీసులకు నటన రాదనే చెప్పాలి. ఇలాంటి స్టంట్లు చేసి పబ్లిక్‌కి అడ్డంగా దొరికిపోతున్నారు.