
ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది . 12వ తరగతి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని వధువును పెళ్లి చేసుకోవడానికి వరుడు నిరాకరించాడు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి కేసు వెనుక గల అసలు కారణాలను గుర్తించారు. రెండు కుటుంబాలు సరైన నిర్ణయం తీసుకోలేదని తిర్వా కొత్వాలి జోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పి.ఎన్.బాజ్‌పాయ్ అన్నారు. ఇంతకీ వరుడు పెళ్లికి నిరాకరించిన కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే…
బాగంవ గ్రామానికి చెందిన రామశంకర్ కుమారుడు సోని కుమార్తె సోనికి వివాహం నిశ్చయించారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. తీరా వధువు మెడలో తాళిపడే సమయానికి వరుడు ఏదో ఒక పిచ్చి కారణం చెబుతూ.. పెళ్లికి నిరాకరించాడు. 12వ తరగతి మార్కు షీట్‌లో వధువుకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పాడు. తీరా పోలీసులు రంగప్రవేశం చేయటంతో అసలు విషయం బయటపడింది. వధువు కుటుంబం తమ కట్నం డిమాండ్లను తీర్చకపోవడంతో వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసిందని పోలీసులు తేల్చారు. ఈ మేరకు వరుడి కుటుంబంపై కేసు నమోదు చేశారు. అమ్మాయి పెళ్లి కోసం రూ. 60 వేలకు పైగా ఖర్చు చేసి వరుడికి 15 వేల విలువైన బంగారు ఉంగరాన్ని ఇచ్చి సోనుతో వివాహం జరిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పెళ్లికి ముందు రోజు నుండే వరుడి కుటుంబం కట్నం డిమాండ్ చేసిందని ఆరోపించారు. తనకు ఎక్కువ కట్నం ఇవ్వలేనని వధువు తండ్రి చెప్పడంతో 12వ తరగతిలో అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చాయని వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. వధువు కుటుంబీకులు తమ బంధువుల ద్వారా వరుడి కుటుంబీకులను ఒప్పించేందుకు ప్రయత్నించగా, వరుడి కుటుంబీకులు వారు అడిగిన కట్నం ఇచ్చే వరకు పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. దీంతో వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ ..