ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రీరామ్ లాగూ కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గతకొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన్ను పూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. శ్రీరామ్ లాగూ మహారాష్ట్రకి చెందిన వారు. సతారా జిల్లాలో 1927 నవంబర్16వ తేదీన జన్మించారు. హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో దాదాపు 211 సినిమాల్లో నటించారు. ఆహత్, పింజ్‌రా, మేరే సాథ్ చల్, సామ్నా, కితాబ్, కినారా వంటి సినిమాల్లో ఆయన నటించారు. ఈయన నటించిన ఘరొండ చిత్రంలో ఉత్తమ నటనకుగానూ 1978లో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. మరాఠా చిత్రాల్లో శ్రీరామ్ లాగూను నటసామ్రాట్‌గా అని పిలుస్తారు.
శ్రీరామ్ లాగూ.. పూణే యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎంఎస్ అభ్యసించారు. అంతేకాదు ఈఎన్‌టీ సర్జన్‌గా కూడా ప్రాక్టీస్ చేశారు. ఆయన సతీమణి దీపా లాగూ కూడా చిత్రసీమకు సంబంధించిన వారే. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.