ఉత్తరభారతంలో ఓవైపు మండుటెండలు జనాన్ని ఇబ్బంది పెడుతుంటే మరోవైపు వరదలతో కొన్ని ప్రాంతాల్లో జనం ఇక్కట్లు పడుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. చంబా వ్యాలీలో వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చంబా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. రోడ్లపై వరదనీరు నిండడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. చాలా ఇళ్లు నీట మునిగాయి. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై వరదనీటిని తొలగించడానికి వందలాదిమంది సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతన్నారు. రోడ్లు కొట్టుకుపోయినట్టు చాలా రోజుల నుంచి అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతి ఏటా కూడా చంబా వ్యాలీలో ఇదే సమస్య ఉందని , కాని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
వరదనీటిలో చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. కొన్ని వాహనలు బురద వరదలో మునిగిపోయాయి. దీంతో వాహన యాజమానులు లబోదిబోమంటున్నారు. వందలాదిమంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సహాయక చర్యల కోసం బుల్‌డోజర్లను వినియోగిస్తున్నారు. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. తమ సామానంతా వరదనీటిలో మునగిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా చంబా వ్యాలీలో అపారనష్టం జరిగింది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం తమను వెంటనే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వరదప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటించారు. పరిస్థితిని సమీక్షించారు. వరదలతో నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.