
గుజరాత్‌లోని వల్సాడ్ తీరంలో మునిగిపోతున్న చేపల పడవ నుంచి 9 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం (ICG) సురక్షితంగా రక్షించింది. ఆగస్టు 18న ‘జయ్ మాలా’ అనే భారతీయ చేపల పడవ ప్రమాదంలో చిక్కుకున్నట్లు కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టింది కోస్ట్‌గార్డ్ బృందం.
వల్సాడ్ తీరంలో పడవ మునిగిపోతున్నట్లు ఆపద సంకేతం అందిన వెంటనే డామన్‌లోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఎయిర్ స్టేషన్ నుంచి చేతక్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా రంగంలోకి దించారు. హెలికాప్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పడవలో ఉన్న మొత్తం 9 మంది మత్స్యకారులను గుర్తించారు. ఒక్కొక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
రక్షించిన మత్స్యకారులను అనంతరం డామన్‌కు తరలించారు. వారిలో ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. డామన్‌కు చేరుకున్న వెంటనే వారికి వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం మత్స్యకారులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
మునిగిపోతున్న పడవ నుంచి సకాలంలో మత్స్యకారులను బయటకు తీసుకురావడంతో పెద్ద సముద్ర ప్రమాదం తప్పింది. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే స్పందించేలా కోస్ట్‌గార్డ్ నిర్వహిస్తున్న నిఘా, రక్షణ వ్యవస్థ మరోసారి ప్రాణాలను కాపాడింది.
ఈ ఘటనలో కోస్ట్‌గార్డ్ ఎయిర్ స్టేషన్ డామన్ సిబ్బంది చూపిన వేగవంతమైన స్పందనపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల భద్రతకు తీర రక్షక దళం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..