ఢిల్లీ, జనవరి 8: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్ నియమితులయ్యారు. ఇస్రో ప్రస్తుత ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం ఈ నెలలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వి.నారాయణన్‌ను కొత్త ఛైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ మంగళవారం (జనవరి 8) ప్రకటించింది. జనవరి 14వ తేదీన నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇస్రో చైర్మన్‌గా ఈ పదవిలో నారాయణన్ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి 4 దశాబ్దాలకుపైగా అనుభవం ఉంది. ఇస్రోకు చెందిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2, 3 వాహకనౌకల రూపకల్పనలో ఆదిత్య-ఎల్1, చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఆపరేషన్‌లలో ఆయన విశేష కృషి చేశారు.
నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. 2001లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. 1984లోనే ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నారాయణన్ APEX స్కేల్ సైంటిస్ట్ మాత్రమేకాకుండా ISROలో అత్యంత సీనియర్ డైరెక్టర్ కూడా.
కాగా ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో రోవర్‌ను ల్యాండ్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ ఖ్యాతి గడించింది. దీంతో US, మాజీ సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించడానికి ప్రయత్నించిన దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఇది దేశాల ఉన్నత క్లబ్‌లో చేరింది.