
ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ అహ్మద్ గురువారం (ఆగస్టు 6) ఝాన్సీ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్న సోను అనే యువకుడు కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అబాన్ అహ్మద్ తన స్నేహితులతో కలిసి ఝాన్సీ జైలులో ఖైదీగా ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలిసేందుకు కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పూర్ – ఝాన్సీ జాతీయ రహదారిపై వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉన్నారు. అబాన్ అహ్మద్, సోను తీవ్రంగా గాయపడగా, స్థానికులు,యు పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు ఒమర్ అహ్మద్, మహమ్మద్ జైద్, అస్లాం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన కారును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వాహనం పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక జంతువు అకస్మాత్తుగా కారు ముందుకు రావడంతో దానిని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో కారు డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిపారు. అయితే ఈ వాదనను పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, అతీక్ అహ్మద్ కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. అతీక్‌కు ఐదుగురు కుమారులు ఉన్నారు. వారిలో అసద్ అహ్మద్ 2023 ఏప్రిల్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అదే ఏడాది అతీక్ అహ్మద్ కూడా తన సోదరుడు అష్రఫ్‌తో కలిసి కాల్పుల్లో హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం అలీ అహ్మద్ ఝాన్సీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మిగిలిన ఇద్దరు కుమారులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతీక్ కుటుంబంలో మరో విషాద ఘటన చోటుచేసుకున్నట్లైంది.
STORY | Atiq Ahmad’s youngest son killed in road accident in UP’s Jhansi
Aban Ahmad, the youngest son of slain gangster-turned-politician Atiq Ahmad, and his friend were killed after their SUV crashed into a divider in Uttar Pradesh’s Jhansi district on Thursday, police said.… https://t.co/Ca1eO6irN0
— Press Trust of India (@PTI_News) August 6, 2026
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..