
ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఒక వివాహ వేడుక ఊహించని మలుపు తీసుకుని, తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. నగిన ప్రాంతంలోని కృష్ణ బాంక్వెట్ హాల్‌లో ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడి తండ్రి వేషధారణ గందరగోళానికి దారి తీస్తుంది. చివరికి పోలీసుల జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
నజీబాబాద్‌కు చెందిన అంకుర్ చౌహాన్, నగినకు చెందిన సాక్షి ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో వీరి వివాహం నిశ్చయమైంది. అయితే, వివాహ ముహూర్త సమయంలో వరుడి తండ్రి అనిల్ చౌహాన్ ఎంట్రీ వధువు కుటుంబంలో ప్రకంపనలు సృష్టించింది. ఆయన పఠానీ సూట్, తలపాగా, పొడవాటి గడ్డంతో ముస్లిం సంప్రదాయ వేషధారణలో కనిపించడంతో వధువు తరపు వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వరుడి తండ్రి వేషధారణను ముస్లిం గుర్తింపుగా భావించిన వధువు కుటుంబం, పెళ్లిని నిలిపివేసింది. భవిష్యత్తులో తమ కుమార్తె కూడా మతం మారాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వారు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి విషమించడంతో వధువు బంధువులు వేదికను వదిలి వెళ్ళిపోయారు.
విచారణలో అనిల్ చౌహాన్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను సుమారు 25 ఏళ్ల క్రితమే ఇస్లాం మతాన్ని స్వీకరించానని, మసీదులకు వెళ్తూ ముస్లిం ఆచారాలను పాటిస్తున్నానని తెలిపారు. అయితే, తన భార్య, కుమారుడు, మిగిలిన కుటుంబ సభ్యులు మాత్రం హిందూ మతాన్నే అనుసరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తన తండ్రి మతం మారినా, తాము హిందువులుగానే ఉంటామని వరుడు హామీ ఇవ్వడంతో వధువు కుటుంబం శాంతించింది. దాదాపు ఏడు గంటల హైడ్రామా తర్వాత, శుక్రవారం ఉదయం 10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం ఘనంగా జరిగింది.
ఇరు పక్షాల మధ్య అవగాహన కుదిరింది. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. కేవలం ఒకరి వ్యక్తిగత విశ్వాసం పెళ్లి ఆగిపోయే వరకు వెళ్లడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. చివరికి ప్రేమ గెలిచి, ఇరు కుటుంబాలు ఒక్కటయ్యాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..