ఘోర రోడ్డు ప్రమాదాలు.. 14 మంది దుర్మరణం.. ఉదయాన్నే ఆలయానికి వెళ్లి వస్తుండగా..

రోడ్లు నెత్తురోడాయి.. వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి చాలామంది బలయ్యారు.. వేర్వేరు రాష్ట్రాల్లో ఆదివారం జరిగిన రోడ్ల ప్రమాదంలో 14 మంది మరణించారు.. ఉత్తరప్రదేశ్‌లో 10 మరణించగా.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

ఘోర రోడ్డు ప్రమాదాలు.. 14 మంది దుర్మరణం.. ఉదయాన్నే ఆలయానికి వెళ్లి వస్తుండగా..
Karnataka Road Accident

Updated on: Aug 18, 2024 | 2:55 PM

రోడ్లు నెత్తురోడాయి.. వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి చాలామంది బలయ్యారు.. వేర్వేరు రాష్ట్రాల్లో ఆదివారం జరిగిన రోడ్ల ప్రమాదంలో 14 మంది మరణించారు.. ఉత్తరప్రదేశ్‌లో 10 మరణించగా.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. బులంద్‌షహర్‌ జిల్లాలో వ్యానును బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఘటనాస్థలిలోనే పది మంది మృతి చెందగా.. మరో 27 మందికి గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలాఉంటే.. కర్ణాటకలో బస్సు, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. గదగ్ జిల్లా నరగుండ తాలూకాలోని కొన్నూరు గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. హవేరీకి చెందిన రుద్రప్ప అంగడి (55), భార్య రాజేశ్వరి (45), కుమార్తె ఐశ్వర్య (16), కుమారుడు విజయ (12) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు శ్రావణ మాసం సందర్భంగా కాలాపురలోని బసవేశ్వర ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం కారులో కల్లాపూర్ వైపు వస్తుండగా.. హాగూ ఇలాకల్ నుంచి హుబ్లీ వెళ్తున్న ట్రాన్స్‌పోర్ట్ బస్సు ఢీకొట్టింది.. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. నరగుంద పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నరగుంద పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఖైరతాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు..

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఖైరతాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.