
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో వివాహ ఊరేగింపులో మొదటి తందూరీ రోటీ ఎవరు తింటారనే వివాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటన తర్వాత.. పెళ్లి జరిగిన ఆనందం కాస్త దుఃఖంగా మారింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అలాగే ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి కుటుంబం దయనీయ స్థితిలో ఉంది. యువకుల కుటుంబ సభ్యులు ఏడుస్తూనే ఉన్నారు.
అమేథిలోని జామో పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బల్భద్ర పూర్ గ్రామంలో నివసించే రామ్జీవన్ వర్మ ఇంట్లో అమ్మాయి వివాహం జరిగింది. పెళ్లి ఊరేగింపు వచ్చే వరకు పెళ్లి తంతు అంతా బాగానే జరిగింది. అందరూ పెళ్లి సన్నాహాలలో బిజీగా ఉన్నారు. ఇంతలో విందు మొదలైంది. వంటవాళ్లు తందూరి రోటీలు పెట్టగానే రవి కుమార్ అలియాస్ కల్లు (18).. ఆశిష్ కుమార్ (17) మధ్య ఎవరు ఎక్కువ రోటీలు తింటారనే పోటీ మొదలైంది. ఇది గొడవగా మారింది.
దీని తరువాత వివాదం ఎంతగా పెరిగిందంటే యువకులు ఇద్దరూ కర్రలు, రాడ్లతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ వివాదంలో ఆశిష్ వర్మ అక్కడికక్కడే మరణించగా, రవిని చికిత్స కోసం లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఈ సంఘటన వార్త తెలియగానే రెండు కుటుంబాల్లోనూ గందరగోళం నెలకొంది. మేము మా పనిలో బిజీగా ఉన్నప్పుడు గొడవ జరుగుతోందని మాకు తెలిసిందని రామ్జీవన్ వర్మ అన్నారు.
మొదట రొట్టె ఎవరు తీసుకుంటారనే దానిపై ఇద్దరి మధ్య వాదన జరిగింది. మేము అక్కడికి చేరుకున్నప్పటికే ఇద్దరూ గొడవ పడుతున్నారు. మేము వారిద్దరినీ విడదీశాము.. అయితే అప్పటికి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాహ ఊరేగింపు సమయంలో ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగిందని.. అందులో ఇద్దరూ మరణించారని గౌరీగంజ్ సర్కిల్ సిఓ అఖిలేష్ వర్మ తెలిపారు.
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఫిర్యాదు, పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..