
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు ప్రాణాలను బలితీసుకుంది. మౌ జిల్లాలో శనివారం (ఏప్రిల్ 25) తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోరిఘాట్‌లోని బర్సాత్‌పూర్-అహిరానీ హైవేపై అతివేగంగా వెళ్తున్న ఒక స్కార్పియో వాహనం అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొట్టి అవతలి లేన్‌లోకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న భారీ ట్రైలర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది.
తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాద ధాటికి స్కార్పియో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, వాహనంలో ఉన్న పెంపుడు కుక్క కూడా మరణించింది. సమాచారం అందుకున్న వెంటనే దోహరిఘాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. అనంతరం వాటిని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతులను బీహార్‌లోని గయా జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వినయ్ శ్రీవాస్తవ (53 సంవత్సరాలు), అతని భార్య అర్చన శ్రీవాస్తవ (48), అతని కుమారుడు కృతార్థ్ శ్రీవాస్తవ (27) తోపాటు రవీంద్ర యాదవ్ (20), పురుషోత్తం కుమార్ (28) ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ కుటుంబం రాంచీలో జరిగిన తమ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పెళ్లి సంబరాల్లో ఉన్న ఆ కుటుంబంలో ఈ వార్త పెను విషాదాన్ని నింపింది. ఆనందంగా ఇంటికి చేరుకోవాల్సిన వారు శవాలై రావడంతో మృతుల బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ ప్రాంతమంతా శోకసముద్రంలో మునిగిపోయింది.
ఘోసి సర్కిల్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ సింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. వారణాసి నుండి గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న స్కార్పియో, వేగం కారణంగా అదుపు తప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపుకు వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. గోరఖ్‌పూర్ నుండి వారణాసి వైపు వస్తున్న ట్రైలర్ డ్రైవర్ తప్పించుకునే అవకాశం లేకపోయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రాణాంతక ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..