Narendra Singh Tomar: వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. బెంగళూరులో వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రులతో రెండు రో జుల పాటు జరిగిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రకృతి సేద్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే ఏపీలో ఈ తరహా ప్రకృతి సేద్యాన్ని అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. ఏపీని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ వ్యవసాయ విధానాల్లో మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు.
ఈ-క్రాప్‌తో అనుసంధానం చేస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులందరికీ వర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా,పీఎం కిసాన్ కింద తమ ప్రభుత్వం నాలుగేళ్లుగా రైతుల ఖాతాల్లో ప్రతి యేటా మూడు విడతల్లో రూ.13,500 జమ చేస్తోందన్నారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6వేల చొప్పున రైతులు అందుకుంటున్నారని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి