బీజేపీ వర్సస్ కాంగ్రెస్.. పార్లమెంట్ ముందుకు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు.. వాడీవేడిగా చర్చ

ఒకే దేశం - ఒకే ఎన్నిక. అందరి కళ్లు ఈ బిల్లు మీదే. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఎలాంటి మార్పులు చేయాలి..? ఈ అంశంపై ఫోకస్‌ పెరిగింది. లోక్‌సభ ముందుకు ఇవాళ ఈ బిల్లు వచ్చింది.

బీజేపీ వర్సస్ కాంగ్రెస్.. పార్లమెంట్ ముందుకు వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు.. వాడీవేడిగా చర్చ
Parliament Winter Session
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 17, 2024 | 12:41 PM

జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దీనిపై చర్చ కొనసాగుతుండగా.. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే. అటు ఈ బిల్లును కాంగ్రెస్, ‌సమాజ్‌వాదీ పార్టీ వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీలు సభలో మాట్లాడుతున్నారు.

జమిలి బిల్లును ప్రవేశపెట్టడం వరకు ఓకే.. కానీ, ఆమోదం పొందడం మాత్రం అంత ఈజీ కానేకాదు. ఎందుకంటే, జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే.. రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. అందుకు, పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోదు. మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం. అంటే, పార్లమెంట్‌లో 67శాతం సపోర్ట్‌ కావాలి.. లోక్‌సభలో 362మంది ఎంపీలు, రాజ్యసభలో 164మంది సభ్యులు మద్దతు దొరికితే బిల్లు గట్టెక్కుతుంది. ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం అధికారపక్షం ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం కనిపించడం లేదు. లోక్‌సభలో 543మంది ఎంపీలు ఉంటే.. అధికారపక్షం ఎన్డీఏకి 293మంది.. విపక్ష ఇండియా కూటమికి 235మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. లోక్‌సభలో జమిలి బిల్లు ఆమోదం పొందడం కష్టమే. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం లేదు. రాజ్యసభలో మొత్తం 245మంది సభ్యులు ఉంటే.. అధికారపక్షం ఎన్డీఏకి 125మంది.. విపక్ష ఇండియా కూటమికి 88మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. రాజ్యసభలోనూ జమిలి బిల్లు ఆమోదం పొందడం కష్టమే.

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు తప్పనిసరి. ముఖ్యంగా పార్లమెంట్‌ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, ఆర్టికల్ 83(2).. ఈ రెండింటినీ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలాగే, అసెంబ్లీలకు సంబంధించిన ఆర్టికల్ 172(1) మరియు (2B), ఆర్టికల్ 356లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 85 (2B), ఆర్టికల్ 327, ఆర్టికల్ 324, ఆర్టికల్ 324(A), ఆర్టికల్ 325.. వీటికి కూడా సవరణలు తప్పనిసరి.

జమిలి బిల్లుకు ఏ పార్టీ మద్దతిస్తోంది.. ఏ పార్టీ వ్యతిరేకిస్తోందో..

ఎన్డీఏలోని పార్టీలన్నీ జమిలికి జైకొడుతున్నాయ్‌. ఎన్టీఏ కూటమిలోని ప్రధాన పక్షమైన బీజేపీతోపాటు టీడీపీ, జేడీయూ, షిండే-శివసేన, అజిత్‌పవార్‌-NCP, జేడీఎస్‌, జనసేన, లోక్‌జన్‌శక్తి, రాష్ట్రీయ లోక్‌దళ్‌, పట్టల్ మక్కల్ కట్చి, ఏజీపీ, సోనేలాల్‌ అప్నాదళ్‌, నేషనల్ పీపుల్స్‌ పార్టీ.. జమిలికి ఓకే అంటున్నాయి. కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ, ఆర్జేడీ, టీఎంసీ, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం.. జమిలికి నో చెబుతున్నాయ్‌. ఒకవేళ జమిలి బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయ్‌. అంటే.. పార్లమెంట్‌, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయ్‌. అలాగే, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..