India vs China: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫైర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అనురాగ్ ఠాకూర్..

భారత్ - చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలొకింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

India vs China: రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల ఫైర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి అనురాగ్ ఠాకూర్..
Minister Anurag Thakur

Updated on: Dec 17, 2022 | 4:27 PM

భారత్ – చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలొకింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో.. దేశంలో ఈ అంశంపై తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగుతుంది. ఇదే అంశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం సంచలన కామెంట్స్ చేశారు. ఓవైపు చైనా సైన్యం చొరబాటుకు పాల్పడుతుంటే.. మరోవైపు బీజేపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, ప్రమాదాన్ని పట్టించుకోకుండా ప్రయత్నిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ప్రభుత్వం నుంచి అంతే ఘాటు ప్పతిస్పందన వస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.

మీడియాతో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్.. ‘రాహుల్ గాంధీ ప్రకటనపై ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. డోక్లామ్ సంఘటన జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఆయన ఇలాంటి కామెంట్సే చేశారు. బహుశా రాహుల్ గాంధీకి మన దేశ సైన్యంపై విశ్వాసం లేకపోవచ్చు. ఇది 1962 నాటి భారతదేశం కాదు. ఇది 2014 తరువాతి భారతదేశం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దూసుకుపోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో సైన్యానికి అవసరమైన యుద్ధ విమానాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, స్నో బూట్‌లు కొనలేకపోయింది. సైన్యం కోసం మీరు చేసిందేంటి?’ అంటూ రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు.

‘నేడు భారతదేశంలో 300 కంటే ఎక్కువ రక్షణ సామాగ్రి తయారవుతోంది. ఇది స్వావలంబన భారతదేశం. భారత్ ఇప్పుడు రక్షణ పరికరాలను దిగుమతి చేసుకోవడం లేదు.. ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. డోక్లామ్ ఘటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత సైన్యాన్ని కలిసి వారిలో విశ్వాసాన్ని నింపారు.’ అని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి.

రాహుల్‌పై రిజిజు విమర్శలు..

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన వ్యాఖ్యలు భారత సైన్యాన్ని అవమానించడమే అని అన్నారు. సైన్యం సామర్థ్యాన్ని అవమానించడమే కాకుండా.. దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సమస్య కాదని, దేశానికే పెద్ద ఇబ్బందిగా పరిణమించారని రిజిజు సంచలన కామెంట్స్ చేశారు.

గౌరవ్ భాటియా ఫైర్..

అదే సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా సైతం రాహుల్‌పై ధ్వజమెత్తారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఇది 1962 నాటి భారతదేశం కాదని రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. భారతదేశంలోని అంగుళం భూమి కూడా ఎవరి ఆధీనంలో లేదు. భారతదేశ భూమిని తీసుకునే ధైర్యం ఎవరికీ లేదు. ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతులైన, సాహసవంతులైన సైనికులు మన వద్ద ఉన్నారు. దౌత్యపరంగా మనం సమర్థులం. మన భూమిలో ఒక్క అంగుళం కూడా ఎవరూ ఆక్రమించే అవకాశం లేదు. భారత సైన్యం మనకు గర్వకారణం. సరిహద్దుల్లో చైనా సైన్యంపై విరుచుకుపడుతున్న జవాన్లు.. తమ సత్తా చాటుతున్నారు. ఇలాంటి సమయంలో మన సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ గాంధీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది తీవ్రమైన విషయం’ అని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు భాటియా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..