
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (జూలై 15) జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దేశ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాల ముఖచిత్రాన్ని మార్చేసే పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.1.27 లక్షల కోట్ల భారీ వ్యయంతో ‘భారత్ సెమీకండక్టర్ మిషన్’ రెండవ దశ (సెమికాన్ 2.0)కు ఆమోదం లభించింది. వీటితో పాటు మొబైల్ తయారీకి పీఎల్ఐ-2 స్కీమ్, వారణాసిలో అత్యంత ప్రతిష్టాత్మక ఎలివేటెడ్ కారిడార్లు, ఎరువుల రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యంగా సరికొత్త యూరియా పాలసీ, రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
చిప్ డిజైనింగ్‌లో స్వయం సమృద్ధి.. ‘సెమికాన్ 2.0’
భారతదేశాన్ని అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0’కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1.27 లక్షల కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలోకి అదనంగా రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ల దేశీయ ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
సెమికాన్ 2.0 మొత్తం ఆరు ప్రధాన మూలస్తంభాలపై పనిచేస్తుందని, అందులో మొదటిది ‘చిప్ డిజైన్’ అని మంత్రి వివరించారు. ముడి ఖనిజాలు, వాయువులను సరఫరా చేసే అనుబంధ పరిశ్రమలకు కూడా ఈ విడతలో ప్రోత్సాహకాలు అందజేస్తారు. గతంలో ప్రవేశపెట్టిన సెమికాన్ 1.0 కింద టాటా ఎలక్ట్రానిక్స్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో రూ.1.64 లక్షల కోట్ల విలువైన 12 ప్రాజెక్టులను ఆమోదించిన సంగతి తెలిసిందే. తాజా అప్‌గ్రేడ్‌తో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) పరికరాల చిప్ అవసరాలను తీర్చడంలో భారత్ స్వయం సమృద్ధి సాధించనుంది.
India’s semiconductor journey gets even more vibrant!
The Cabinet has approved Semicon 2.0 with an outlay of Rs. 1,27,500 crore, reaffirming our long-term commitment to making India a global centre for semiconductor design, manufacturing and innovation. Powered by our youth,…
— Narendra Modi (@narendramodi) July 15, 2026
మొబైల్ తయారీకి రూ.62,500 కోట్ల పీఎల్ఐ 2.0
భారతీయ బ్రాండ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు మొబైల్ ఫోన్ల తయారీ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకం రెండవ దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందు కోసం రూ.62,500 కోట్లు మంజూరు చేసింది. ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి 2030-31 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉంటుంది. దీని ద్వారా రూ.15 లక్షల కోట్ల విలువైన భారీ ఎగుమతులు జరగడంతో పాటు 60,000 మంది యువతకు ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
A massive boost to ‘Make in India’ and our electronics manufacturing ecosystem!
The Cabinet’s approval of the Mobile Phone Manufacturing Scheme, with an outlay of Rs. 62,500 crore will scale up production, deepen domestic value addition, strengthen supply chains and create a…
— Narendra Modi (@narendramodi) July 15, 2026
కాశీ రూపురేఖలు మార్చనున్న ఎలివేటెడ్ కారిడార్లు
ఆధ్యాత్మిక నగరం వారణాసి (కాశీ)లో పెరుగుతున్న పర్యాటకుల రద్దీని తట్టుకునేలా రెండు అద్భుతమైన ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించనున్నారు. ఏటా కాశీని సందర్శించే 15 కోట్ల మంది పర్యాటకులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
కారిడార్ 1: NH-19 – వారణాసి రింగ్ రోడ్ మధ్య రూ.14,447.64 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్.
కారిడార్ 2: NH-31ని వారణాసి రింగ్ రోడ్‌కు అనుసంధానిస్తూ వరుణా నది వెంబడి 43.218 కిలోమీటర్ల పొడవైన ఆరు, నాలుగు-లేన్ల ఎలివేటెడ్ కారిడార్. దీని వ్యయం రూ.10,998.32 కోట్లు.
ఈ రెండు కారిడార్లు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేయనున్నాయి.
ఎరువులు, రైల్వే రంగాల్లో కీలక సంస్కరణలు
వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా జాతీయ పెట్టుబడి విధానం-2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా దేశంలో కొత్తగా 8 నుండి 9 సహజ వాయువు ఆధారిత యూరియా ప్లాంట్లను ఏర్పాటు చేసి, అదనంగా కోటి టన్నుల యూరియా ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ఎరువుల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.
రైల్వే మౌలిక వసతుల పెంపునకు గాను రూ.3,907 కోట్ల వ్యయంతో రెండు భారీ ప్రాజెక్టులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) ఆమోదించింది. ఇందులో పారాదీప్-హరిదాస్‌పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, రాజ్‌ఖర్సవాన్-డాంగోపోసి మార్గంలో నాల్గవ రైల్వే లైన్ నిర్మాణం ఉన్నాయి. ఇవి పూర్తయితే పారిశ్రామిక రవాణాతో పాటు ప్రయాణీకుల రైళ్ల వేగం పెరిగి సమయపాలన మెరుగవుతుంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు దేశ సర్వతోముఖాభివృద్ధికి బలమైన పునాది వేయనున్నాయి.
A major boost to connectivity and economic growth in Odisha and Jharkhand!
The Cabinet has approved two important railway multitracking projects, the doubling of the Paradeep-Haridaspur line and the fourth line between Rajkharsawan and Dangoaposi. These projects will further…
— Narendra Modi (@narendramodi) July 15, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..