ULFA: అసోంలో శాంతికి బీజాలు.. కుదిరిన త్రైపాక్షిక శాంతి ఒప్పందం

అసోంలో శాంతికి బీజాలు పడ్డాయి. ఉల్ఫా తీవ్రవాదులతో కేంద్రం, అసోం సర్కార్‌ త్రైపాక్షిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. అసోంలో శాంతి నెలకొంటుందని , ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ది పథంలో దూసుకెళ్తాయన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా .

ULFA: అసోంలో శాంతికి బీజాలు.. కుదిరిన త్రైపాక్షిక శాంతి ఒప్పందం
United Liberation Front of Assam (ULFA)'s pro-talks faction signed a tripartite Memorandum of Settlement pact with the Centre and the Assam government in the presence of Union Home Minister Amit Shah, Assam CM Himanta Biswa Sarma

Updated on: Dec 29, 2023 | 9:58 PM

అసోంకు చెందిన ఉల్ఫా తీవ్రవాదుల గ్రూప్‌తో కేంద్రం చారిత్మాత్మక ఒప్పందం చేసుకుంది. ఉగ్రవాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే రీతిలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రవాద సంస్థ ఉల్ఫాతో త్రైపాక్షిక శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో జరిగిన చర్చల్లో హోంశాఖ మంత్రి అమిత్‌షా , అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ పాల్గొన్నారు. 30 మంది ఉల్ఫా నేతల ప్రతినిధుల బృందం ఈ శాంతి చర్చల్లో పాల్గొంది.

అసోంలో 1979 నుంచి ఉల్ఫా సంస్థ తీవ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ప్రత్యేక అసోం దేశం కోసం ఈ సంస్థ పోరాటం చేస్తోంది. ఉల్ఫాతో శాంతి ఒప్పందంతో ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అసోంలో శాంతి నెలకొంటుందన్నారు హోంశాఖ మంత్రి అమిత్‌షా. చర్చల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుందన్నారు.

నరేంద్ర మోదీ 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టాక ఈశాన్య రాష్ట్రాలు , ఢిల్లీ మధ్య దూరం తగ్గిందన్నారు అమిత్‌షా. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది కోసం కేంద్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయన్నారు. “ఉల్ఫాతో శాంతిచర్చలతో ఈశాన్యంలో ముఖ్యంగా అసోంలో కొత్త చరిత్ర ప్రారంభమవుతుంది. భారత ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకోవాలని ఉల్ఫా నేతలను కోరుతున్నా.. మీ డిమాండ్ల అమలుకు కేంద్ర హోంశాఖ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది. నిర్ణీత గడువులో మీ డిమాండ్లు నెరవేర్చేవిధంగా చర్యలు ఉంటాయి” అని అమిత్ షా పేర్కొన్నారు.

అయితే ఈ చర్చలకు ప‌రేశ్ బారువా నేతృత్వంలోని ఉల్ఫా స్వతంత్ర గ్రూపు దూరంగా ఉంది. అక్రమ వ‌ల‌స‌లు, తెగ‌ల‌కు భూమి హ‌క్కులు, అసాం అభివృద్ధి కోసం ఆర్థిక ప్యాకేజీ లాంటి స‌మ‌స్యలు ఈచర్చలతో కొలిక్కి వ‌చ్చే ఛాన్సు ఉంది. ద‌శ‌ల వారీగా ఉల్ఫా డిమాండ్ల‌ను తీరుస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆఫ్సా లాంటి ప్రత్యేక చ‌ట్టాల‌ను తొల‌గించామ‌ని, దీని ఉద్దేశం అస్సాంలో తిరుగుబాటు త‌గ్గిన‌ట్లే అవుతుంద‌న్నారు. త్వరలోనే ఉల్ఫా కార్యకర్తలు క్యాంప్‌లను విడిచి జనజీవన స్రవంతి లోకి వస్తారన్నారు అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..