మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ తయారీ రంగం పుంజుకొని యువతకు ఉపాధి కల్పిస్తోంది. బీజేపీ ఎంపీ వికాస్ మహాత్మే ప్రశ్నకు కేంద్రం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. 2014-15లో రూ.1.9 లక్షల కోట్ల నుంచి 2019-20 నాటికి రూ 5.33 లక్షల కోట్లకు పరిశ్రమ రంగం పెరిగిందని తెలిపింది. సగటున ఏడాదిలో 23% వృద్ధిరేటుతో పరిశ్రమ రంగం విస్తరిస్తోందని పేర్కొంది.
సెమీ కండక్టర్ చిప్ తయారీ సామర్థ్యం కలిగిన సంస్థలు దేశంలో ఉన్నాయని తెలిపింది. మొహలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, హైదరాబాద్‌లోని గ్యాలియం ఆర్సెనైడ్ ఎనేబిలింగ్ టెక్నాలజీ సెంటర్, సెమీకండక్టర్ చిప్ డిజైన్, తయారీ, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ చేయగలవని వెల్లడించింది. అయితే దేశంలో కమర్షియల్ చిప్ తయారీ ప్లాంటు ఎక్కడా లేదని పేర్కొంది. చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నం చేస్తోందని తెలిపింది. సెమీకండక్టర్ చిప్ తయారీ రంగంలో కేంద్రం 25% మూలధన వ్యయం అందించడం సహా పలు ప్రోత్సాహకాలను ప్రకటించిందని గుర్తుచేసింది. ఈ రంగంలో పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా ఇస్తోందని తెలిపింది. భారతీయ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడితే 2023 వరకు కార్పొరేట్ ట్యాక్స్ లో రాయితీ – మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించింది