
మల్కాంగిరి, జూలై 27: ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వారు 24 గంటలు హై అలర్ట్‌తో ఉండాలి. లేదంటే ఎప్పుడు ఎటు నుంచి ఉరుకులు పరుగులు తీయాలో తెలియని పరిస్థితి దాపురిస్తుంది. తాజాగా అటువంటి సంఘటనే ఓ ఇంట్లో చోటు చేసుకుంది. ఇంటి అవసరాల కోసం ఓ వ్యక్తి కొత్త బిందె ఒకటి కొనుక్కొచ్చాడు. అదే అతడు చేసిన నేరం అయింది. ఇంట్లో అతడి మూడేళ్ల కొడుకు తండ్రి చేతిలో దగదగ మెరిసిపోతున్న బిందెను చూసి ఆశ్చర్యంతో కళ్లు చేటంత చేసుకుని.. దాన్ని గబాలున లాక్కుని దాంతో ఆడసాగాడు. పిల్లాడు ఆడుకుంటున్నాడు కదాని తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంతే కాసేపటికే నాన్నోయ్.. అంటూ ఏడుపులంకించు కున్నాడు కొడుకు..! ఏం జరిగిందోనని పరుగున వెళ్లిన తండ్రి అక్కడి దృశ్యం చూసి షాకై గుడ్లప్పగిచ్చి చూడసాగాడు. ఈ విచిత్ర సంఘటన ఒరిస్సాలోని మల్కాంగిరి జిల్లాలోని కోరుకొండ బ్లాక్‌లో శనివారం (జులై 26) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
ఒడిశా-ఆంధ్రా సరిహద్దులోని మల్కాన్‌గిరి జిల్లాలో కోరుకొండ గ్రామానికి చెందిన ప్రదీప్ బిశ్వాస్ అనే వ్యక్తి కొత్త బిందె కొని ఇంటికి తెచ్చాడు. ప్రదీప్‌కి మూడేళ్ల కొడుకు తన్మయ్ ఉన్నాడు. తండ్రి తెచ్చిన బిందె చూసిన తన్మయ్ అదేదో అడుకునే బొమ్మనుకుని దానితో ఆడసాగాడు. ఇంతలో పిల్లాడు తల బిందెలో పెట్టి లోపల చూడసాగాడు. తల అయితే పెట్టాడు కానీ అది తిరిగి బయటకు రాలేదు. అంతే.. తల బిందెలో ఇరుక్కుపోవడంతో తన్మయ్ ఏడుపు లంకించుకున్నాడు.
ప్రదీప్‌తోపాటు కుంటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా బాలుడి తల బిందె నుంచి బయటకి రాలేదు. దీంతో వారు కోరుకొండ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పిల్లాడిని జిల్లాలోని అగ్నిమాపక కేంద్రానికి తరలించారు. అక్కడ దాదాపు రెండు గంటల పాటు శ్రమించి బిందెను రెండు వైపులా కత్తిరించారు. పిల్లాడికి ఎలాంటి గాయం కాకుండా కట్టర్ సాయంతో బిందెను తల నుంచి తొలగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆపరేషన్‌ను మల్కాన్‌గిరి అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ కమల్ కుమార్ గౌడ, కోరుకొండ ఎల్‌ఎఫ్‌ఎఫ్ బసుదేవ్ బివాల్ ఇతర అధికారులు విజయవంతంగా నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.