ఏనుగు మృతి ఘటన.. ముగ్గురు అనుమానితుల గుర్తింపు.. కేరళ సీఎం పినరయి విజయన్

కేరళలో ఏనుగు మృతికి సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కొంత పురోగతి కనిపించింది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను గుర్తించినట్టు...

ఏనుగు మృతి ఘటన.. ముగ్గురు అనుమానితుల గుర్తింపు.. కేరళ సీఎం పినరయి విజయన్

Edited By:

Updated on: Jun 04, 2020 | 6:51 PM

కేరళలో ఏనుగు మృతికి సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కొంత పురోగతి కనిపించింది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను గుర్తించినట్టు సీఎం పినరయి విజయన్  ట్వీట్ చేశారు. ఈ ఘటనపట్ల అనేకమంది వెలిబుచ్చిన తీవ్ర విచారాన్ని, వారి ఆవేదనను తాము గ్రహించామని, ఇన్వెస్టిగేషన్ చురుకుగా జరుగుతోందని, ముగ్గురు అనుమానితులపై పోలీసులు దృష్టి పెట్టారని ఆయన పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు కూర్చిన పైన్ యాపిల్ తిని ఈ గర్భస్థ ఏనుగు గాయపడి మరణించిన సంగతి విదితమే. ఈ గజరాజం గాయం కారణంగా  ఏ ఆహారం తినలేక సుమారు 20 రోజుల పాటు ఆకలితో మాడిందని అటాప్సీ నివేదిక అభిప్రాయపడింది. సాధారణంగా పొలాల్లో తమ పంటలను వన్య మృగాలు తినకుండా చూసేందుకు రైతులు ఇలా క్రాకర్స్ పేర్చిన పండ్లు, లేదా పైన్ యాపిల్ వంటివాటిని పెడుతుంటారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అవి తిన్న జంతువులు గాయపడి మృతి చెందుతుంటాయి. అయితే ఈ ఏనుగుకు గ్రామస్థులు కావాలనే ఇలాంటి పైన్ యాపిల్ ని తినిపించారా.. లేక పొలంలో ఉంచిన పండును అదే తిని గాయపడిందా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.

ఇలా ఉండగా- కేరళ లోనే కొల్లామ్ జిల్లాలో గత ఏప్రిల్ నెలలో ఈ విధమైన ఘటనే జరిగినట్టు తెలిసింది. క్రాకర్స్ నింపినట్టు భావిస్తున్న పండును తిన్న ఓ ఆడ ఏనుగు నోట్లో అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడిందని, ఆ ఏనుగు కూడా ఏమీ ఆహారం తినలేకపోయిందని ఓ అటవీ అధికారి తెలిపారు. ఈ జిల్లాలోని పునలూర్ పరిధిలోగల పథనపురం ఫారెస్ట్ రేంజిలో ఈ ఘటన జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. బలహీనంగా ఉన్న ఆ గజరాజాన్ని సమీపించబోగా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయి తన ఇతర ఏనుగుల మందతో కలిసిందని, కానీ ఆ మరుసటి రోజే మళ్ళీ అదే ప్రాంతానికి చేరుకుందని, చివరకు మరణించిందని ఆయన వివరించారు.