వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు రామ్ కుమార్ కుటుంబానికి ఈ ఏడాది NEET ఫలితాలు జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని ఇచ్చాయి. ఆయన ముగ్గురు కుమారులు వెంకట్ శ్రీ, ధరణ్, అరుణ్ ఒకే ఏడాది NEETలో అర్హత సాధించి MBBS సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఈ ముగ్గురూ తమిళనాడులోని 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కోటా ద్వారా మెడికల్ సీట్లు సాధించారు.

వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..
Three Brothers

Edited By:

Updated on: Aug 18, 2026 | 2:54 PM

మనం పడిన కష్టాలను తమ పిల్లలు పడకూడదని, వారు ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు జీవితాంతం శ్రమిస్తుంటారు. ముఖ్యంగా తమ పిల్లల్లో ఒక్కరైనా డాక్టర్ కావాలని కలలు కనే తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ చేనేత కార్మికుడి కుటుంబానికి మాత్రం అతని ముగ్గురు కుమారులు ఒకేసారి మెడికల్ సీట్లు సాధించి ఊహించని ఆనందాన్ని అందించారు.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా వెళ్ళాంగులికి చెందిన చేనేత కార్మికుడు రామ్ కుమార్‌కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట్ శ్రీ కాగా.. ధరణ్, అరుణ్ కవల సోదరులు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ ముగ్గురూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఇటీవల వెలువడిన NEET ఫలితాల్లో ముగ్గురు అన్నదమ్ములు ఒకే ఏడాది మెడికల్ సీట్లు సాధించారు. తమిళనాడులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అమలవుతున్న 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కోటా ద్వారా ముగ్గురికీ MBBS సీట్లు లభించాయి.

పెద్ద కుమారుడు వెంకట్ శ్రీకి ఇది అంత సులభంగా సాధ్యం కాలేదు. మెడికల్ సీటు కోసం రెండుసార్లు NEET రాసి విఫలమైన అతను.. పట్టుదలతో మూడోసారి పరీక్ష రాసి విజయం సాధించారు. మరోవైపు ఆయన తమ్ముళ్లు, కవలలు అయిన ధరణ్, అరుణ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే NEETలో అర్హత సాధించి మెడికల్ సీట్లను దక్కించుకున్నారు.

ముగ్గురు కుమారులు ఒకేసారి వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కడంతో రామ్ కుమార్ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తండ్రి చేనేత కార్మికుడిగా కష్టపడుతుండగా.. ముగ్గురు కుమారులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఒకేసారి వైద్య సీట్లు సాధించడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తల్లిదండ్రుల కష్టానికి పిల్లలు ఇచ్చిన విజయమే అసలైన బహుమతి అంటారు. రామ్ కుమార్ కుటుంబానికి మాత్రం ఆ బహుమతి ఒక్కరితో ఆగలేదు.. ఒకేసారి ముగ్గురు కుమారుల రూపంలో వచ్చింది. ఈ ముగ్గురు అన్నదమ్ముల విజయం పేదరికం ప్రతిభకు అడ్డుకాదని, పట్టుదలతో చదివితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us