Telugu News India News The excitement of Republic Day celebrations in the country, Do you know the special features of this day, Republic Day 2025 details in telugu
Republic day: దేశంలో రిపబ్లిడ్ డే వేడుకల జోష్.. ఈ రోజుకున్న ప్రత్యేకతలు తెలుసా..?
రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లతో దేశంలో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. జనవరి 26వ తేదీన జరిగే ఈ జాతీయ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకూ అంబరాన్నంటేలా సంబరాలు జరగనున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15తో పాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ మనకు ఎంతో ముఖ్యమైనది. ఈ సందర్బంగా గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవ ప్రత్యేకతలను తెలుసుకుందాం.
ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 2025లో 76వ గణతంత్ర వేడుకలను నిర్వహించుకోనున్నాం. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నాటి నుంచి గణతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సెలవును ప్రకటిస్తారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తారు. ప్రతి చోటా జెండా ఎగురవేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
రిపబ్లిక్ డే ప్రత్యేకతలు
భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ స్వరాజ్ ప్రకటన చేసింది. దాని జ్ఞాపకార్థం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకొంటారు.
రిపబ్లిక్ డే పరేడ్ సన్నాహాలు ఆ ముందు ఏడాది జూలైలో ప్రారంభమవుతాయి. దానిలో పాల్గొనేవారు తమ వివరాలను అధికారికంగా తెలియజేస్తారు. పరేడ్ జరిగే రోజు తెల్లవారుజాము 3 గంటలకే కర్తవ్య పథ్ కే చేరుకుంటారు. అప్పటికే దాదాపు 600 గంటల పాటు సాధన చేసి ఉంటారు.
ఢిల్లీలో జరిగే రిపబ్లిడ్ డే వేడుకలను ఏటా ముఖ్య అతిథిగా ఒక దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి లేదా పాలకులను ఆహ్వానిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా రానున్నారు.
గన్ సెల్యూట్ ఫైరింగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. జాతీయ గీతం ప్రారంభంలో మొదటి గన్ షాట్ పేలుతుంది. అనంతరం 52 సెకన్ల తర్వాత కాల్చుతారు.
ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకల కోసం ఒక థీమ్ ను తయారు చేస్తారు. దాన్ని అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు అనుసరిస్తాయి. ఈ ఏడాది జరిగే పరేడ్ లో టెబుల్ యాక్స్ థీమ్ గా స్వర్ణిమ్ భారత్ – విరాసత్ జౌర్ వికాస్ (బంగారు భారత దేశం – వారసత్వం, అభివృద్ధి) గా నిర్ణయించారు. దీని ప్రకారం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, సంప్రదాయం, దేశ పురోగతిపై ప్రదర్శనలు ఉంటాయి.
రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేట్, ఎర్రకోట మీదుగా గ్రాండ్ కవాతు జరుగుతుంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితర ఎందరో మహానుబావులు భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు.
న్యూ ఢిల్లీలోని ఇర్విన్ స్డేడియంలో 1950లో మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సైన్యానికి చెందిన 100 కంటే ఎక్కువ విమానాలు, 3 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇర్విన్ స్డేడియాన్ని ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా పిలుస్తున్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడిన వారు, అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటం చేసినవారు, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు రిపబ్లిడ్ డే రోజు జాతీయ శౌర్య పతకాలు అందిస్తారు.
అలాగే పలు రంగాల్లో తమ ముద్ర చేసుకున్న వారికి రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రధానం చేస్తారు.