
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ భారత దేశాన్ని కలిచి వేసింది. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌కు వ్యతిరేకంగా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్-పాక్ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. భారత్ నుంచి పాక్ వెళ్లే సింధూ జలాలను నిలిపివేసింది. దీంతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అటారీ-వాఘా సరిహద్దును పూర్తిగా మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. భారత్‌లో ఉన్న పాకిస్థాన్ దేశస్తులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు తిరిగి దేశానికి రావాలని తెలిపింది. దీంతో గత వారం రోజులుగా ఈ బోర్డర్ గుండా రెండు దేశాల ప్రజలు రాకపోకలు సాగించారు. భారత్‌లో ఉన్న పాకిస్థానీయులు వెళ్లిపోవడం, పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు ఇండియాకు రావడం జరిగింది. అయితే వివిధ వీసాలపై భారత్‌లో ఉన్న పాకిస్థాన్ దేశస్థులు భారత్ వదిలి వెళ్లేందుకు విధించిన గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. ఈ క్రమంలోనే అటారీ-వాఘా సరిహద్దును భారత్ ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై దౌత్యపరమైన, ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనిలో భాగంగా అటారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేశారు. ఇకపై ఇరుదేశాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలులేదని అధికారులు తెలిపారు. దీంతో గడిచిన ఏడు రోజుల్లో భారత్‌లో ఉన్న 911 మంది పాకిస్తానీలు తిరిగి వాళ్ల దేశానికి వెళ్లిపోగా.. పాకిస్థాన్‌లో ఉన్న 15 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే అటారీ సరిహద్దు భారత్-పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గం. దీని మూసివేత వల్ల రెండు దేశాల మధ్య ప్రయాణం, వాణిజ్యం, సీమాంతర కదలికలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు దేశాల పౌరుల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఈ మూసివేత ఎప్పటివరకు కొనసాగుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..