
Modi Income: రాజకీయ నాయకులపై ఉన్న కేసులు, ఆస్తులు, ఇతర విషయాల గురించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) అనే సంస్థ ఎప్పుడూ ఏవోక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వెల్లడిస్తూ ఉంటుంది. ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రజాప్రతినిధులు ఎన్నికల సంఘానికి అందించే అఫిడవిట్ల వివరాలను విశ్లేషించి ఆసక్తికర విషయాలను విడుదల చేస్తూ ఉంటుంది. గతంలో సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల వివరాలతో పాటు దేశంలోని సీఎంల ఆస్తుల విలువను ఏడీఆర్ బయటపెట్టింది. అందులో భాగంగా తాజాగా దేశంలోని ఎంపీల ఆస్తుల వివరాలతో ఓ రిపోర్టును వెలుగులోకి తెచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రధాని మోదీ ఆస్తి విలువ రూ.3 కోట్లుగా ఏడీఆర్ తన నివేదికలో పొందుపర్చింది. వారణాసి నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచి మోదీ హ్యాట్రిక్ కొట్టారు. ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం.. ప్రస్తుతం ఆస్తి విలువ రూ.3,02,06,889గా ఉంది. 2014లో పోటీ చేసినప్పుడు రూ.1.65 కోట్లుగా ఉండగా.. 2019 నాటికి రూ.2.51 కోట్లుగా ఉంది. 2014తో పోలిస్తే ఇప్పటివరకు మోదీ ఆస్తి 82 శాతం పెరిగింది. ఇక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తుల వివరాలను కూడా ఏడీఆర్ వెలుగులోకి తెచ్చింది.
రాహుల్ గాంధీ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.20.39 కోట్లుగా ఉంది. 2014లో రూ.9.40 కోట్లుగా ఉండగా.. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.15.88 కోట్లకు పెరిగింది. 2024 ఎన్నికల్లో ఈసీకి సమర్పించిన వివరాల ప్రకారం చూస్తే రూ.20.39 కోట్లుగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 2014తో పోలిస్తే రాహుల్ ఆస్తి ఏకంగా 117 శాతం పెరగడం విశేషం. 2014లో రాహుల్ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేయగా.. 2019లో వయనాడ్ నుంచి పోటీలోకి దిగారు. ఇక 2024 ఎన్నికల్లో అమేధీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.
భారీగా ఆస్తులు పెరిగిన ఎంపీల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టాప్ 3లో ఉన్నారు. 2014లో ఆయన ఆస్తి విలువ రూ.22 కోట్లుగా ఉండగా.. 2019 నాటికి రూ.66 కోట్లకు చేరుకుంది. ఇక 2024 నాటికి రూ.146 కోట్లకు పెరిగింది. అటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తి 10 ఏళ్లల్లో రూ.19 కోట్లు అదనంగా పెరిగింది. ఇక కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆస్తి రూ.14.89 కోట్లు పెరగ్గా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆస్తి రూ.40 కోట్లకు చేరుకుంది. 2014లో అవినాష్ ఆస్తి రూ.7 కోట్లు,. 2019లో రూ.18 కోట్లుగా ఉంది.