Actor Kasthuri: కస్తూరి మాటలు తెలుగు, తమిళ విభజన కోసమేనా..? ద్రవిడ నినాదానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారా?

అన్నమయ్య మూవీ హీరోయిన్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్నాయి. తెలుగు అమ్మాయే.. అయినా తెలుగువాళ్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు మూడు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. కస్తూరి మాటల్లో అర్థం.. పరమార్ధమేంటి?.. అంటే.. లోతుగా ఆలోచిస్తే ఎన్నో విషయాలు, ఆలోచనలు వస్తున్నాయి. భవిష్యత్తులో తమిళ్ వర్సెస్‌ అదర్స్ అనేలా తమిళనాడు విడిపోబోతోందా? తెలుగు, ఇతర భాషల పునాదులు ఉన్న వాళ్లంతా ఒకవైపు.. సిసలైన తమిళులను మరోవైపున ఉంచేలా ఏదైనా ప్రయత్నం జరుగుతోందా? నటి కస్తూరి కామెంట్లు చూస్తే.. తమిళ ఆత్మగౌరవం, ద్రవిడ నినాదాలతోనే ఇకపై రాజకీయాలు సాగేలా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తుంది..

Actor Kasthuri: కస్తూరి మాటలు తెలుగు, తమిళ విభజన కోసమేనా..? ద్రవిడ నినాదానికి మళ్లీ ప్రాణం పోస్తున్నారా?
Katsuri
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 06, 2024 | 9:15 PM

తమిళ్ వర్సెస్‌ అదర్స్ అనేలా తమిళనాడు విడిపోబోతోందా? తెలుగు, ఇతర భాషల పునాదులు ఉన్న వాళ్లంతా ఒకవైపు.. సిసలైన తమిళులను మరోవైపున ఉంచేలా ఏదైనా ప్రయత్నం జరుగుతోందా? నటి కస్తూరి కామెంట్లు చూస్తే.. తమిళ ఆత్మగౌరవం, ద్రవిడ నినాదాలతోనే ఇకపై రాజకీయాలు సాగేలా ఉన్నాయి తమిళనాడులో. కస్తూరి కామెంట్లు ఏదో ఫ్లోలో వచ్చినట్టుగా అనిపించడం లేదు. ‘ఏదో అనబోతే ఇంకేదో అయింది’ అని కస్తూరి కవర్‌ చేసుకున్నప్పటికీ.. కావాలనే ఆ టాపిక్‌ తీసినట్టు కనిపిస్తోంది. అందులోనూ.. తలపతి విజయ్‌ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత ఈ కామెంట్స్ వచ్చాయి. తనది ద్రవిడవాదం అని విజయ్‌ చెప్పిన తరువాత కస్తూరి నుంచి ఈ మాటలు వినిపించాయి. అంటే.. తమిళనాడులో మరోసారి ద్రవిడవాదం పురుడుపోసుకుంటోందా? అసలేంటీ ద్రవిడవాదానికి అర్థం? వేరే ప్రాంతం వాళ్లని తమిళులుగా అంగీకరించకపోవడం, వారిని అనుమతించకపోవడమేనా? అదే నిజమైతే.. తమిళనాడును ఏలిన వాళ్లంతా అసలైన ద్రవిడులేనా? ఇవన్నీ.. డిటైల్డ్‌గా తెలుసుకోండి..

ద్రవిడ జాతి ప్రాంతీయవాదం. చాలా పవర్‌ఫుల్‌ నినాదం ఇది. వందేళ్లకు పైగా చరిత్ర ఉందీ నినాదానికి. చాలామందికి అర్థం కాకపోవచ్చు గానీ.. డీకోడ్‌ చేస్తే అందులో చాలా మీనింగ్‌ ఉంది. ముఖ్యంగా.. బ్రాహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకమైన నినాదమే ఈ ద్రవిడవాదం. ఒకానొక దశలో తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ అంతరించిపోవడానికి, ఇప్పటికీ తమిళనాట బీజేపీ బలంగా వెళ్లలేకపోవడానికి కారణం ఈ ద్రవిడవాదమే. ద్రవిడవాదం ప్రకారం.. బ్రాహ్మణులు ఆర్యులు. అంటే.. ఎక్కడి నుంచో వచ్చారు అనేది వారి భావన. సో, ఎక్కడినుంచో వచ్చి తమపై పెత్తనం చెలాయించడం ఏంటి అంటూ ఓ ఉద్యమం నడిపారు. పెరియార్ రామస్వామి ఈ ఉద్యమాన్ని ఊరువాడ తీసుకెళ్లారు. అలా ద్రవిడవాదం పుట్టుకొచ్చింది. ఇంతకీ.. బ్రాహ్మణులపై, దేవుళ్లపై, సంస్కృతం, హిందీపై తమిళులకు ఎందుకంత కోపం? దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. బ్రిటిషర్స్ కాలంలో మద్రాస్‌ ప్రెసిడెన్సీకి చాలా ప్రాధాన్యత ఉండేది. ఆ సమయంలో భారతీయులకు కూడా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఇవ్వాలనుకున్నారు బ్రిటిషర్స్. ఆ పోస్టుల కోసం చాలా మంది అప్లై చేసుకున్నప్పటికీ.. తమిళ బ్రాహ్మణులు, తెలుగు బ్రాహ్మణులకు మాత్రమే ఆ ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకంటే.. చదువుకున్న వాళ్లు అయి ఉండడం, ఇంగ్లీష్‌ భాషపై పట్టు ఉండడంతో వాళ్లకే ఎక్కువ ఉద్యోగాలొచ్చేవి. అలా మద్రాస్‌ ప్రెసిడెన్సీలో 75 శాతం తహశీల్దారులు బ్రాహ్మణులే ఉండేవాళ్లు. అప్పట్లో.. మద్రాస్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో చదువుతున్న వారిలో 93 శాతం బ్రాహ్మణులే. మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని మొత్తం జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య 3.2 శాతమే అయినప్పటికీ.. అవకాశాల్లో మాత్రం వాళ్లదే పైచేయి. అదే సమయంలో అంటరానితనం బాగా ఎక్కువగా ఉండేది. ఆలయాల్లోకి దళితులను రానివ్వలేదు. దీంతో తమిళ సమాజంలోని పెద్దలు వెళ్లి అప్పటి కాంగ్రెస్‌ లీడర్లను అడిగారు. తమిళనాట కేవలం బ్రాహ్మణులకే పెద్దపీట వేయడం ఏంటి, ఈ సమస్యను పరిష్కరించండి అని అడిగితే.. ప్రస్తుతం తమకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడమే ముఖ్యం అంటూ సమాధానం ఇచ్చారు. ఇక తమకు న్యాయం జరగదనే నిర్ణయానికొచ్చిన కొందరు.. ఓ నినాదం తీసుకొచ్చారు. ఇది కాస్త పెద్ద నినాదమే అనుకోండి. పెరియార్ రామస్వామి అప్పట్లో ఇచ్చిన నినాదం ఏంటంటే.. ‘దేవుడు లేడు, మతం లేదు అని అనడంతో పాటు గాంధీ లేరు, కాంగ్రెస్‌ లేదు, బ్రాహ్మణులూ లేరు’ అంటూ ఓ నినాదం ఎత్తుకున్నారు. అందుకే, ఇప్పటికీ తమిళనాడులో సంస్కృతం భాషను, ఉత్తరాదిలో ఎక్కువగా మాట్లాడే హిందీని తమ రాష్ట్రంలోకి రావివ్వరు. వారి లక్ష్యం ఒక్కటే. కులం, మతం లేని సమాజం ఏర్పడాలన్నదే. అదే సమయంలో తమిళ భాష, తమిళ సంస్కృతి మాత్రమే ఉండాలని ఉద్యమించారు. అలా.. ఆ ద్రవిడవాదం నుంచి ఇప్పుడున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలూ పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్‌, బీజేపీ ఉత్తర భారతదేశ ఆర్యుల పార్టీలు అనేది తమిళుల నమ్మకం. అందుకే, అక్కడ ప్రాంతీయవాదానికి, ద్రవిడవాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ‘మన ప్రాంతం, మన పెత్తనం, మన అధికారం’ అనే నినాదం కారణంగానే జాతీయ పార్టీలు తమిళనాడులో అడుగుపెట్టలేకపోతున్నాయి. అంతా బాగానే ఉంది గానీ తమిళనాడును పాలించిన వారందరూ తమిళులు కాదు. ఈ విషయం అక్కడి వాళ్లకూ తెలుసు. కాని, ద్రవిడవాదం పేరుతో నెగ్గుకురాగలిగారు. ఇప్పటికీ, అక్కడ ద్రవిడవాదం పేరుతోనే రాజకీయాలు జరుగుతున్నాయి కూడా. అదో విచిత్రం అక్కడ.

కరుణానిధి. తమిళనాడుకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధి ఫ్యామిలీ ఏపీ నుంచే వచ్చారనేది ఓ వాదన. కస్తూరి టార్గెట్‌ చేసింది కూడా ఈ అంశాన్నే. తమిళనాడు సీఎం స్టాలిన్‌ పూర్వీకులు తెలుగువాళ్లే అని చెప్పడమే కస్తూరి ఉద్దేశం. ఏపీలోని ఒంగోలు ప్రాంతం నుంచి సీఎం స్టాలిన్‌ పూర్వీకులు వచ్చారని చెబుతుంటారు. సో, 300 ఏళ్ల క్రితం తమిళనాడుకు వచ్చిన తెలుగువాళ్లను ఆదరించినప్పుడు.. శతాబ్దాల క్రితమే వచ్చిన బ్రాహ్మణులను మాత్రం ఎందుకు ఆదరించకూడదు అని మాట్లాడారు కస్తూరి. ఆ విషయం పక్కనపెడితే.. తమిళనాడును ఏలిన వాళ్లలో చాలామంది తెలుగువాళ్లే. అంతెందుకు డీఎంకే పార్టీ పుట్టడానికి కారణమైన అన్నాదురై సైతం సగం తెలుగువ్యక్తే. అన్నాదురై తల్లి బంగారమ్మ తెలుగావిడే. ఇలా.. అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్‌ మాత్రమే కాదు జయలలిత కూడా అచ్చమైన తమిళమ్మాయి కాదంటుంటారు. అప్పటి మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలో పుట్టారు జయలలిత. సో, జయలలిత కూడా అసలుసిసలు తమిళ వ్యక్తి కాదు. అయినా సరే.. 14 ఏళ్లకు పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా చేశారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడలోనూ సినిమాలు చేసినప్పటికీ.. ‘తమిళ సినిమా క్వీన్’ అనే పేరు సంపాదించుకున్నారు జయలలిత. అలా ఎంజీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీ రామచంద్రన్‌ కూడా తమిళుడు కాదు. అతనో మలయాళీ అంటుంటారు. ఎంజీఆర్‌ ఇంట్లో మలయాళం మాట్లాడుతూ బయట తమిళం మాట్లాడుతారని, జయలలిత ఇంట్లో కన్నడం మాట్లాడుతూ, బయట తమిళం మాట్లాడేవారని చెబుతుంటారు. ఎండీఎంకే అధినేత వైకో ఇంట్లో కూడా ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుకుంటారని చెప్తారు. ఇక.. సినిమారంగంలో ‘కెప్టెన్‌’గా పేరు తెచ్చుకున్న దివంగత DMDK అధినేత విజయ్‌కాంత్‌ది కూడా తెలుగు రక్తమే. ఓ సందర్భంలో ఆయనే చెప్పుకున్నారీ విషయం. బ్రిటిష్‌ కాలంలో తన తాత ముత్తాతలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడుకు వలస వచ్చారని చెప్పుకున్నారు. విజయ్‌కాంత్‌ తండ్రి, ఆయన పూర్వీకులు బలిజ నాయుడు సామాజికవర్గానికి చెందిన వాళ్లని అంటుంటారు. అందుకే, విజయ్‌కాంత్‌ కుమారుడు విజయ్ ప్రభాకర్‌.. విరుధునగర్‌ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఎందుకంటే.. అక్కడ నాయుడు సామాజివర్గం వాళ్లు ఎక్కువగా ఉంటారు. అంటే.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడు వెళ్లి సెటిల్ అయిన ఫ్యామిలీ అన్నమాట. ఒకప్పటి హీరోయిన్‌ రాధిక శరత్‌కుమార్‌ సైతం ఇదే విరుధునగర్‌ నుంచి పోటీ చేశారు. కారణం.. నాయుడు సామాజికవర్గ ఓట్ల కోసమే. రాధిక శరత్‌కుమార్‌కు సైతం తెలుగు మూలాలున్నాయి. ఆమె తండ్రి అచ్చతెలుగు వ్యక్తి. అందుకే, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో నాయుడు ఓట్ల కోసం విరుధునగర్‌ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం తమిళనాడులోని వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్‌ కూడా తెలుగు వ్యక్తే. ‘నామ్ తమిజార్’ పార్టీని నడుపుతున్న సీమాన్‌ భార్య కూడా తెలుగువారే. తమిళనాడులో తెలుగు మాట్లాడే బలమైన షెడ్యూల్డ్‌ కులాల సమూహం ఉంది. వారి కోసం ‘ఆది తమిజార్ పేరవై’ అనే పార్టీ ఉంది. సో, ఆ పార్టీ అధినేత అధియమాన్ కూడా తెలుగు వ్యక్తే…

తమిళనాడు సినీరంగంలోనూ తెలుగు వాళ్లున్నారు. విశాల్ కృష్ణారెడ్డి అంటే తెలియకపోవచ్చు గానీ.. హీరో విశాల్‌ అంటే అందరికీ తెలుస్తుంది. పక్కన రెడ్డి అని ఉందంటేనే అతను తెలుగు వ్యక్తి అని అర్ధమైపోతోంది. ఇక జయం రవి సైతం తెలుగువారే. రాధిక, రాధా రవి సైతం తెలుగు మూలాలున్నవాళ్లే. నటుడు నెపోలియన్‌ కూడా అచ్చతెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. రెడ్డి సామాజికవర్గం ఆయనది. ఆయన మామయ్య కె.ఎన్.నెహ్రూ ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కూడా. ఇక సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ తమిళుడు కాదు. ఆయనది మహారాష్ట్ర. ఇలా.. తమిళ సినిమాను ఏలుతున్న వారిలో చాలామంది తెలుగువాళ్లు, ఇతర రాష్ట్రాల వాళ్లున్నారు.

తమిళవాదం, ద్రవిడవాదం అని చెప్పుకుంటున్నప్పటికీ.. తమిళనాడును అభివృద్ధి చేసిన వారిలో నాన్‌ తమిళుల పాత్రే ఎక్కువ. దశాబ్దాల క్రితమే తమిళనాడుకు వెళ్లి సెటిల్‌ అయిన ఎంతో మంది తెలుగువాళ్లు.. తాము తెలుగువాళ్లమే అన్న విషయమే మరిచిపోయారు. 2013లో ఓ ఎన్జీవో చేసిన సర్వే ప్రకారం.. తమిళనాట రెండు కోట్ల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో 40 శాతం తెలుగువాళ్లే. కాంచీపురం, కోయంబత్తూరు, మధురై, కృష్ణగిరి, తేని, వేలూరు జిల్లాల్లో 35 శాతం మంది తెలుగువాళ్లున్నారు. తిరుచ్చి, విరుదునగర్, ధర్మపురిలో 30 శాతం, సేలం, విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, తంజావూరు, దుండిగల్, తూత్తుకూడి, శివగంగై జిల్లాల్లో 25 శాతం తెలుగువాళ్లు ఉన్నారు. తమిళనాడులోని 32 జిల్లాల్లో ఆరు జిల్లాలు మినహా.. అన్ని ప్రాంతాల్లోనూ కనీసం 20 శాతం మంది తెలుగువారు ఉన్నారు. తమిళనాడు రాజధాని చెన్నై. గతంలో మద్రాస్‌గా పిలిచిన ఈ ప్రాంతాన్ని చెన్నైగా మార్చారు. కారణం ఏంటంటే.. తమిళనాడుకు ఆ స్థలాన్ని ఇచ్చింది చెన్నయ్య అనే వ్యక్తి కాబట్టి. ఆయన తెలుగువారు. ఆయన పేరు మీదే చెన్నై అనే పేరు వచ్చింది. ఆ చెన్నైలో ప్రస్తుతం 90 శాతం మంది తెలుగువారే ఉంటారని చెబుతుంటారు. కాని, ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం మాత్రం.. తమిళనాట తెలుగువాళ్లు 10 శాతం కూడా లేరు. ఎందుకంటే.. ఎన్నో తరాలుగా వారు అక్కడే స్థిరపడడం, తమను తాము తమిళులుగా భావించడం, తమ మాతృభాష సైతం తమిళమే అని అనుకోవడం కారణంగా.. వారంతా తమిళులుగా మారిపోయారు. ఇప్పటికీ.. చాలా మంది ఇళ్లల్లో తెలుగు మాట్లాడుతుంటారు. కాని, బయటకు వస్తే మాత్రం తమిళం మాట్లాడతారు.

యెంగెస్ట్‌ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డ్‌ ఉన్న డి.గూకేశ్‌ సైతం చెన్నైలో పుట్టిన తెలుగు వ్యక్తే. కరోనా వ్యాక్సిన్‌ కనిపెట్టిన ఎల్లా కృష్ణమూర్తిని తమిళులు తమవాడు అంటుంటారు. కాని, కాని, ఎల్లా కృష్ణమూర్తిది తెలుగు ఫ్యామిలీ. తిరుత్తణిలో జన్మించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సైతం తెలుగే. ఎడిసన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరున్న కోయంబత్తూరు ఇంజనీర్ కమ్‌ ఇన్వెంటర్‌ జీడీ నాయుడుది కూడా తెలుగు రక్తమే. ఇలా.. తమిళ రాజకీయాల్లో, తమిళ సినిమా ఇండస్ట్రీలో, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వైద్య, క్రీడా రంగాల్లో తెలుగువాళ్లే ఉన్నారు.

ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు.. కె.ఎన్.నెహ్రూ, వేలు, ఆర్.గాంధీ, రాంచందర్, శేఖర్‌ బాబు సైతం తెలుగువాళ్లే. జయలలిత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న బాలకృష్ణారెడ్డి, కడంబూర్ రాజు తెలుగు రాజకీయ నాయకులే. డీఎంకే ఎంపీ కళానిధి వీరాస్వామికి సైతం తెలుగు మూలాలున్నాయి. మొన్నీమధ్యే కమ్మ సంఘం మీటింగ్‌ జరిగితే వీరాస్వామి కూడా వచ్చారు.

ఆమాటకొస్తే.. తెలుగు, తమిళులని వేరువేరు చూడ్డానికి కూడా వీల్లేదంటారు. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు వేంగి రాజ్యంలో తమిళులు, తెలుగువాళ్లు కలిసే ఉండేవాళ్లు. ది గ్రేట్‌ కింగ్ రాజరాజ చోళ.. తన కుమార్తెను ఒక తెలుగు రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. చోళ వంశంలో పేరు ప్రతిష్టలు సంపాదించిన కొలుత్తుంగ-1 చక్రవర్తి తెలుగు వ్యక్తే. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం మొదలయ్యాక.. వారి పరిపాలన భాషగా తెలుగే ఉండేది. ప్రస్తుత తమిళనాడును మూడు భాగాలుగా విభజిస్తారు. దక్షిణ భాగాన ఉన్న మధురై, తూర్పు ప్రాంతమైన తంజావూరు, మధ్య ప్రాంతమైన సెంజీ. ఈ మూడు ప్రాంతాలను పాలించడానికి నాయకులను పంపించారు విజయనగర సామ్రాజ్యాధీశులు. ఆ నాయకులంతా తెలుగువాళ్లే. అలా 200 ఏళ్ల పాటు తమిళ ప్రాంతాలన్నీ తెలుగువారి రూలింగ్‌లోనే ఉన్నాయి.

ద్రవిడవాదం అంటే తమిళవాదమే అని చాలా మంది అనుకుంటుంటారు. తమిళం మాట్లాడితేనే ద్రవిడులు అనేది ఒట్టి అపోహ అంటుంటారు. నిజానికి ద్రవిడవాదం భాషకు సంబంధించింది కాదు ప్రాంతానికి సంబంధించింది అనేది చరిత్రకారుల మాట. ఒకప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీలో తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళ భాషల వాళ్లు ఉండేవాళ్లు. ఈ నాలుగు భాషలు మాట్లాడే ప్రాంతాన్నే ఒకప్పుడు ద్రావిడ ప్రాంతం అని అనేవారు. అంటే, ఆంధ్ర, తమిళనాడు, కర్నాటక, కేరళ.. ఈ నాలుగు రాష్ట్రాలతో కలిపి ఉన్న మద్రాస్‌ ప్రెసిడెన్సీనే ద్రవిడదేశం అని, ద్రావిడులు అని అనేవాళ్లు.

ఏదేమైనా తమిళనాడు రాజకీయాలు మరోసారి ద్రవిడవాదం చుట్టూ తిరగబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే కస్తూరి ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. తమిళనాడు పాలకులు తెలుగు మాట్లాడే వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించడం వెనక ఈ ద్రవిడవాదమే కనిపిస్తోంది. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. తమిళనాడులో 2 కోట్ల మంది తెలుగువాళ్లు ఉన్నారు. వాళ్లంతా సైలెంట్‌ ఓటర్లు. తమ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయనంత వరకు ఓకే. అవమానించినట్టు మాట్లాడితే గనక.. వాళ్లే స్వింగ్ ఓటర్లుగా మారే అవకాశం ఉందంటున్నారు. తెలుగువారిని కించపరుస్తూ ఎవరు మాట్లాడినా సరే.. ఆ వ్యాఖ్యలు ఆ పార్టీని కచ్చితంగా దెబ్బతీస్తాయంటున్నారు. ఈ ప్రమాదాన్ని బీజేపీ కూడా ముందే ఊహించింది. బీజేపీ తమిళనాడు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నది కూడా తెలుగు వ్యక్తి అయిన పొంగులేటి సుధాకర్‌రెడ్డే. అందుకే, వెంటనే తన వ్యాఖ్యలను కవర్‌ చేసుకున్నారు కస్తూరి. తాను తెలుగువారికి వ్యతిరేకంగా మాట్లాడలేదంటూ చెప్పుకొచ్చారు.

అమెరికా అంతలా డెవలప్‌ కావడానికి కారణం.. అన్ని ప్రాంతాల వాళ్లు ఎంతో కొంత తమ శ్రమను ధారపోయడం వల్లే. ఎన్నో దేశాల వాళ్లు అమెరికాలో ఉంటూ అమెరికాను డెవలప్‌ చేశారు. అలాగే, తమిళనాడును డెవలప్‌ చేసిన వారిలో తెలుగువాళ్లతో పాటు ఇతర భాషల వాళ్లూ ఉన్నారు. వారంతా ‘ఇది మా భూమి’ అనుకున్నారు కాబట్టే.. తమిళనాడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. అలాంటిది.. మళ్లీ ద్రవిడవాదంతో రాజకీయాలు చేస్తామంటే మాత్రం వాళ్ల గొయ్యి వాళ్లే తీసుకున్నట్టు. ద్రవిడవాదం అంటే తమిళవాదమే అని భ్రమపడితే మాత్రం ఏ పార్టీకైనా చావుదెబ్బ తప్పదు. ఎందుకంటే.. తమిళ భాషను గౌరవించడం వేరు, ఇతర భాషల వారిని కించపరచడం వేరు. ఒకవేళ అదే ద్రవిడ వాదంగా భావిస్తే మాత్రం.. రాజకీయ సమాధి తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.