Union Budget 2022: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్(Budget 2022)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంటు(Parliament)లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.39.45 లక్షల కోట్లతో అంచనాల బడ్జెట్‌ను లోక్‌సభ ముందు ఉంచారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా బడ్జెట్ ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్. మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి అన్నారు. కేంద్ర బడ్జెట్ ను నిర్మల ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. కాగా, బడ్జెట్ లో వేతన జీవులకు పన్ను పరంగా కేంద్రం ఎటువంటి ఊరట కల్పించ లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల విషయంలోనూ పన్నుపరంగా ఎటువంటి ఉపశమనం లేదన్నారు. మరోవైపు, కేంద్ర బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు భిన్నంగా స్పందించారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వివిధ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈఏడాది బడ్జెట్ పూర్తిగా ప్రజావ్యతిరేక బడ్జెట్ అని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. సామాన్యులకు ఏ కోణంలోనూ ఆశాజనకంగా లేని బడ్జెట్.. నిరుపయోగమని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దిశ లేని బడ్జెట్ గా ఉందని విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఊతం అన్న మాట ఉంది.. కానీ కేటాయింపులు కనపడటం లేదన్నారు. దశదిశాలేని ఈ బడ్జెట్ వల్ల భవిష్యత్తులో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు. తెలంగాణకు ముందు నుంచి అన్ని బడ్జెట్లలో అన్యాయమే చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్క బడ్జెట్లోనూ ఆశాజనకమైన కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్ ప్రజలకు ఎంతమాత్రం ఉపయుక్తంగా లేదు. దశదిశ నిర్దేశం లేకుండా నిరుపయోగంగా బడ్జెట్ ఉందని కేశవరావు విరుచుకుపడ్డారు. పేదలు, మధ్యతరగతి వర్గాలకు దీని వల్ల ఎలాంటి లబ్ధి కలగదు. ధాన్యం సేకరణ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇంత సేకరించాం.. అంత సేకరించామని గొప్పలు పోతున్నారే తప్ప.. ఇప్పటికీ రోడ్ల మీదున్న ధాన్యం సంగతేంటనేది చెప్పలేదు. రాష్ట్రాలకు లక్ష కోట్లు అన్నారే తప్ప.. ఏ రాష్ట్రానికి ఎంత అన్నది స్పష్టత ఇవ్వలేదని కేశవరావు విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక, పేదలు, ఉద్యోగులు, వ్యవసాయ, కార్మిక వ్యతిరేక బడ్జెట్. ఏ ఒక్క వర్గాన్ని సంతృప్తిపరిచేలా కేంద్ర బడ్జెట్ లేదన్నారు.
వచ్చే 25 ఏళ్లకు అమృతకాల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. రైతులు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఆ దిశగా చర్యలు లేవని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌పై రచ్చబండలోనూ చర్చలు జరగాలి. పంటలకు కనీస మద్దతు ధర, ధాన్యం సేకరణపై ప్రకటిస్తారని ఆశలు పెట్టుకున్నారు. సాగు రంగాన్ని పట్టించుకోకుండా అన్నింటినీ డిజిటల్ చేస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులపై అన్ని రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయన్నారు నామా.
ఏపీకి సరియైన న్యాయం జరగలేదుః విజయసాయి రెడ్డి
కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరుత్సాహపర్చిందని వైసీపీ అభిప్రాయపడింది. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్ కా వికాస్ అస్సలు లేదన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి.. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఏ మాత్రం లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి కేంద్రానికైనా, రాష్ట్రానికైనా ఒకటేనన్నారు. కేంద్రం ఆ పరిధి దాటవచ్చు, రాష్ట్రాలు దాటకూడదు అంటున్నారు. ఇది ద్వంద్వ ప్రమాణాలకు దారి తీస్తుంది. మూలధన వ్యయం పెంపును స్వాగతిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సరైన న్యాయం జరగడం లేదు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు. జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని ఆయన కోరారు.
ఫైనాన్స్ కమిషన్ ఫార్మూలా వల్ల ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుందన్నారు. నదులు అనుసంధానం చేస్తామనం మంచి పరిణామం. పీఎం గతిశక్తితో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. ఉద్యోగల భర్తీపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనా లేదన్నారు. ఎంఎస్‌పీకి న్యాయబద్ధతపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదన్నారు. సేవా రంగంలో గ్రోత్ లేదని ఆర్థిక సర్వే చెబుతోంది. ప్రభుత్వం రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. టీడీపీ హయాంలో పరిమితికి మించి రుణాల సేకరణ చేశారని.., ఆ మేరకు ఇప్పుడు కోత విధించడం సరి కాదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి రాష్ట్రాలకే విధించడం సరికాదని.. కేంద్రం కూడా ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉందని.., రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారని.. ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి కేవలం రూ.4 వేల కోట్లేనని వెంటనే ఆ ఫార్ములాను సవరించాలని, రాష్ట్ర వాటా పెంచాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. గత ఏడాది ఏపీకి వచ్చింది కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమేనన్న విజయసాయి అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా రూ.1.53 లక్షల కోట్ల ఇచ్చారని ఆ స్థాయిలో వ్యత్యాసం ఉంది. వెంటనే దీన్ని సవరించాలని కోరారు.
ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టిన దాదాపు రూ.40 లక్షల కోట్ల బడ్జెట్, గత ఏడాది కంటే 4.6 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా ఉందని.., బడ్జెట్ పెరగడం అభినందనీయమైనా, వృద్ధి రేటు చూస్తే.. 2021–22లో 9.2 శాతంగా బడ్జెట్‌లో చూపారన్నారు. కరోనా సమయంలో అంత సాధించడం ప్రశంసనీయమన్నారు. మూలధన వ్యయం కింద గతంలో రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు ఇవ్వగా, ఈసారి లక్ష కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారన్న విజయసాయి రెడ్డి.. ఇది స్వాగతించదగిన విషయమే అయినా, కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్రానికి ఇస్తున్న మొత్తం 4.047 శాతం మాత్రమేనన్నారు. ఇప్పుడు ఇస్తామన్న లక్ష కోట్లులో అదే ఫార్ములాను పరిగణలోకి తీసుకుంటే, రాష్ట్రానికి వచ్చేది కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమేని అభిప్రాయపడ్డారు. కేంద్ర పన్నుల్లో ఇతర రాష్ట్రాలను చూస్తే.. మహారాష్ట్రకు 6.31 శాతం, మధ్యప్రదేశ్‌కు 7.8 శాతం, యూపీకి 17.9 శాతం ఇస్తున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయినా ఈ నిధుల్లో అన్యాయం జరుగుతోంది. సరైన న్యాయం జరగడం లేదని స్పష్టం చేశారు.