Watch: అవార్డు ఇవ్వడానికి వేదిక మీద అన్నామలై.. మంత్రి కొడుకు పనితో అంతా షాక్.. వీడియో వైరల్..

తమిళనాడులో కొంతకాలంగా డీఎంకే వర్సెస్ బీజేపీగా రాజకీయాలు నడుస్తున్నాయి. హిందీని బలవంతంగా తమపై రుద్దుతున్నారంటూ డీఎంకే ఆందోళనలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ అవార్డుల వేడుకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత చేతులమీదుగా అవార్డు తీసుకోవడానికి డీఎంకే మంత్రి కొడుకు నిరాకరించాడు.

Watch: అవార్డు ఇవ్వడానికి వేదిక మీద అన్నామలై.. మంత్రి కొడుకు పనితో అంతా షాక్.. వీడియో వైరల్..
Minister's Son Refuses Medal From Annamalai

Updated on: Aug 27, 2025 | 7:17 AM

తమిళనాడులో బీజేపీ నేతలను బహిరంగంగా వ్యతిరేకించే సంఘటనలు మరోసారి చోటుచేసుకున్నాయి. తాజాగా 51వ రాష్ట్ర షూటింగ్ క్రీడల అవార్డుల ప్రదానోత్సవంలో బీజేపీ కీలక నేత అన్నామలైకి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిఆర్‌బి రాజా కుమారుడు సూర్య రాజ బాలు అన్నామలై చేతుల మీదుగా పతకం స్వీకరించడానికి నిరాకరించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అన్నామలై.. విజేతలకు పతకాలు అందించడానికి వేదికపై ఉన్నారు. అయితే బంగారు పతకం గెలుచుకున్న సూర్య రాజ బాలు.. అన్నామలైకి దూరంగా జరిగి మెడలో పతకం వేసుకోవడానికి నిరాకరించారు. అన్నామలై చేతులోంచి ఆ పతకం తీసుకున్నాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ పరిణామంపై అన్నామలై ఎలాంటి అసహనం వ్యక్తం చేయలేదు. సూర్య రాజతో ఫొటో దిగి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ ఘటనపై ఓ ఈవెంట్‌లో ఎదురైన ప్రశ్నకు అన్నామలై స్పందించారు. ‘‘ఒక నాయకుడు ప్రజలతో ప్రేమ, అభిమానంతో ఉండాలి తప్ప ద్వేషంతో కాదు’’ అని బదులిచ్చారు. సూర్య రాజా బాలుకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు లభించాలని ఆకాంక్షించారు. గత కొంతకాలంగా బీజేపీ, అధికార డీఎంకే పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చర్చనీయాంశమైంది.

అయితే ఈ తరహా నిరసన సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు. కేవలం రెండు వారాల క్రితం.. తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవంలో.. డాక్టరల్ విద్యార్థి జీన్ జోసెఫ్ కూడా ఇలాంటి నిరసననే తెలియజేశారు. డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం. రాజన్ భార్య అయిన జోసెఫ్, వేదికపై ఉన్న గవర్నర్ ఆర్‌ఎన్ రవిని దాటి వెళ్లి, వైస్ ఛాన్సలర్ నుండి తన డిగ్రీని అందుకున్నారు. ఈ సంఘటనపై ఆమె స్పందిస్తూ.. గవర్నర్ ‘‘తమిళ వ్యతిరేకి అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. ‘‘నేను ద్రవిడ మోడల్‌ని నమ్ముతాను. అలాగే వైస్ ఛాన్సలర్ తమిళానికి చాలా సేవలు చేశారు. అందుకే నేను ఆయన చేతుల మీదుగా నా డిగ్రీని తీసుకోవాలనుకున్నాను’’ అని జీన్ జోసెఫ్ తెలిపారు. అయితే పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలోకి ఇలాంటి తక్కువ స్థాయి రాజకీయాలను తీసుకురావద్దని అన్నామలై మండిపడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..