Wedding Reception in Metaverse: మెటావర్స్‌ పద్ధతిలో వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. దేశంలోనే తొలి జంటగా అరుదైన గుర్తింపు..

|

Feb 08, 2022 | 1:33 PM

మన దేశంలో పెళ్లంటే ఓ పండగలా భావిస్తారు. ఉన్నంతలో గ్రాండ్‌గా తమ వివాహాన్ని జరుపుకోవాలని చాలామంది భావిస్తారు. విందులు, వినోదాలు, ఫొటోషూట్లు, సంగీత్‌లు.. ఇలా పెళ్లికి ముందే ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు

Wedding Reception in Metaverse: మెటావర్స్‌ పద్ధతిలో వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. దేశంలోనే తొలి జంటగా అరుదైన గుర్తింపు..
Follow us on

మన దేశంలో పెళ్లంటే ఓ పండగలా భావిస్తారు. ఉన్నంతలో గ్రాండ్‌గా తమ వివాహాన్ని జరుపుకోవాలని చాలామంది భావిస్తారు. విందులు, వినోదాలు, ఫొటోషూట్లు, సంగీత్‌లు.. ఇలా పెళ్లికి ముందే ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. అయినా కరోనా కారణంగా ఇప్పుడా సందడంతా మాయమైపోయింది. ఉన్నంతలో ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే ఏడడుగులు నడస్తున్నారు వధూవరులు. ఈక్రమంలో తమిళనాడుకు చెందిన ఓ జంట వినూత్న పద్ధతిలో వివాహ రిసెప్షన్‌ను జరుపుకున్నారు. తమిళనాడులోని ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్టు అసోసియేట్‌గా పనిచేస్తున్న దినేష్‌ క్షత్రియన్‌- జనగనందిని రామస్వామి తాజాగా పెళ్లిపీటలెక్కారు. తమిళనాడులోని ఓ మారుమూల గిరిజన ప్రాంతమైన శివలింగపురంలో వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయితే గ్రాండ్‌గా జరుపుకోలేకపోయారు కానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ అయినా తమ బంధువులు, స్నేహితులందరి సమక్షంలో జరుపుకోవాలనుకున్నారు. అయితే ప్రస్తుతమున్న కొవిడ్ నిబంధనలతో అది సాధ్యపడలేదు. ఈక్రమంలోరు మెటావర్స్ (Metaverse) అనే వర్చువల్‌ పద్ధతిలో (virtual reality) వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా వధూవరుల బంధువులు, స్నేహితులు, సన్నిహితులు వర్చువల్‌గా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వర్చువల్ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అసలేంటి మెటావర్స్‌?

మెటావర్స్ అనేది ప్రస్తుతం మనం ఉపయోగిస్తోన్న ఇంటర్నెట్ తర్వాతి దశ. బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి వివిధ సాంకేతిక అంశాలను మిళితం చేసే ఒక ప్లాట్‌ఫారమ్. ఇక్కడ రియాలిటీకి వర్చువల్ రూపం ఇవ్వబడుతుంది. ఈ వర్చువల్ ప్రపంచంలో 3D రూపంలో ఒకరితోమరొకరు డిజిటల్‌ అవతార్‌ల రపంలో ఇంటరాక్ట్‌ అవ్వొచ్చు. ప్రస్తుతం జరిగిన దినేష్‌ – జనగనందిని వెడ్డింగ్ రిసెప్షన్‌ కూడా అలాంటిదే. ఇందులో భాగంగా రిసెప్షన్‌కు ముందు అతిథులందరికీ ఒక లాగిన్ ఐడీ ఇవ్వబడుతుంది. ఈ ఐ‌డీ సహాయంతో అతిథులందరూ రిసెప్షన్‌ను యాక్సెస్ చేస్తారు. వీ‌ఆర్ బాక్స్‌ ద్వారా వారి వర్చువల్ అవతార్‌లను ఎంచుకోవచ్చు. అనంతరం ఈ వర్చువల్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో పాల్గొని ఒకరినొకరు సంభాషించుకోవచ్చు. కాగా మెటావర్స్‌లో వివాహ రిసెప్షన్ నిర్వహించాలనే ప్రత్యేకమైన ఆలోచన వరుడు దినేష్‌దేనట. ‘నేను బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో పనిచేస్తున్నాను, మెటావర్స్‌కు అదే మూలం కావడంతో ఆ పద్ధతిలోనే రిసెప్షన్‌ జరుపుకోవాలనుకున్నాను. నాఆలోచనను నాకు కాబోయే భార్యతో పంచుకోగా ఆమె కూడా సంతోషంగా అంగీకరించింది. మెటావర్స్‌ పద్ధతిలో యూజర్లంతా వర్చువల్‌గా కలుసుకుంటారు. డిజిటల్‌ అవతార్‌లతో ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు. ఈ మెటావర్స్‌ విధానంలో ఆగ్మెంటెడ్‌ రియాల్టీ, బ్లాక్‌చైన్‌, వర్చువల్‌ రియాల్టీ కలగలిసి ఉంటాయి’ అని చెప్పుకొచ్చాడు దినేష్‌. కాగా దేశంలో ఇలా మెటావర్స్‌ పద్ధతిలో వెరైటీగా వెడ్డింగ్‌ రిసెప్షన్‌ జరుపుకున్న తొలి జంట దినేష్‌- జనగనందినిదే కావడం విశేషం. ప్రస్తుతం దీనిక సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి.