ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSDగా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!
Cm Joseph Vijay, Astrologer Ricky Radhan Vetrivel

Edited By:

Updated on: May 12, 2026 | 4:37 PM

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSD (Officer on Special Duty)గా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ పేరు గత కొన్ని నెలలుగా తమిళనాడు రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఎన్నికల ముందు నుంచే విజయ్ పార్టీ తమిళగా వెట్రి కళగం (TVK) భారీ విజయాన్ని సాధిస్తుందని, విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చేసిన జోస్యం అప్పట్లో వైరల్ అయింది. అప్పట్లో చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన పేరు మరింత హాట్ టాపిక్‌గా మారింది.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగా వెట్రి కళగం పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న DMK–AIADMK ఆధిపత్యానికి చెక్ పెడుతూ విజయ్ పార్టీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుంది. అనంతరం మిత్రపక్షాల మద్దతుతో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

రికీ రాథన్ పండిట్‌ను తమిళనాడులో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్కుడు. ఆయన ఎన్నికలకు చాలా ముందే విజయ్ విజయాన్ని అంచనా వేశారు. గత ఏడేళ్లుగా రికీ రతన్ విజయ్‌కు వ్యక్తిగత జ్యోతిష్కుడిగా ఉన్నారు. ఈ ఏడేళ్లలో, విజయ్ అంతర్గత, బాహ్య వ్యవహారాలకు సంబంధించిన ప్రతి వివరమూ ఆయనకు తెలుసు. రికీ ముఖ్యమంత్రి విజయ్ నమ్మకస్తులలో ఒకరని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన కార్యాలయంలోని 14 మంది అధికారులను బదిలీ చేయడంతో పాటు, కొత్త అధికారులను నియమించారు.

ఇలాంటి సమయంలో తనకు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న జ్యోతిష్యుడిని ప్రభుత్వంలో కీలక పదవిలో నియమించడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక అధికారిగా ఆయన పని చేయనున్నట్లు సమాచారం. ఈ నియామకంతో ప్రభుత్వ వ్యవహారాల్లో జ్యోతిష్య ప్రభావం పెరుగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు విజయ్ అభిమానులు మాత్రం “తనపై నమ్మకం ఉంచిన వ్యక్తికి సీఎం గుర్తింపు ఇచ్చారు” అంటూ సమర్థిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని వ్యక్తిగత విశ్వాసంగా చూస్తుండగా, మరికొందరు ప్రభుత్వ వ్యవస్థలో జ్యోతిష్యులకు అధికారిక స్థానం ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ద్రావిడ రాజకీయాల్లో శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచనలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పే తమిళనాడులో ఇలాంటి నిర్ణయం రావడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ నిర్ణయాన్ని విజయ్ వ్యక్తిగత నమ్మకాలతో పాటు, తనకు రాజకీయంగా అండగా నిలిచిన వ్యక్తులను దగ్గర ఉంచుకునే వ్యూహంగా కూడా చూస్తున్నారు. ఏదేమైనా, తమిళనాడు కొత్త రాజకీయాల్లో ఈ నియామకం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us